Thursday, December 12, 2024

అగ్రస్థానానికి బ్రూక్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మడలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న ఇంగ్లండ్‌కే చెందిన సీనియర్ ఆటగాడు జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టాడు. కొంతకాలంగా బ్రూక్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్న సంగతి తెలిసిందే. వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. దీంతో బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో 898 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జో రూట్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్10లో చోటు సంపాదించాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్టులో హెడ్ చిరస్మరణీయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ ఐదు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ ఆరో ర్యాంక్‌కు చేరాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా మూడు ర్యాంక్‌లు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ర్యాంక్‌లు కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఒక ర్యాంక్ పడిపోయి 17వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత సీనియర్ ఆటగాడు తాజా ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు కోల్పోయి 20వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్30 నుంచి వైదొలిగాడు. రోహిత్ ఐదు ర్యాంక్‌లు కోల్పోయి 31వ ర్యాంక్‌లో నిలిచాడు.

బుమ్రా అగ్రస్థానం పదిలం..
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 890 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా నిలకడైన బౌలింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతని టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ రెండో, జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) మూడో, ఆసీస్ కెప్టెన్ కమిన్స్ నాలుగో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఒక ర్యాంక్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News