బిఆర్‌ఎస్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం, చిన్నకోడూరు మండలం, చంద్రాపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని అన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కృంగిపోతేనే మొత్తం ప్రాజెక్టు కృంగిపోయిందని గగ్గోలు పెట్టి బిఆర్‌ఎస్‌పై బురదచల్లారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరంలో ఒక పిల్లర్ అయినా బాగు చేయలేదన్నారు.
ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజీ 2 లో ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి నీరు తగ్గినప్పటికీ తాము కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులతోపాటు మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఆదాయం వస్తుందన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ఇలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలని, లేదంటే చరిత్ర వారిని క్షమించదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న పంట కాలువను పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుతోందన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి థ్యాంక్స్
పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని తాను విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుండి 1 టిఎంసి నీటిని రంగనాయక సాగర్‌కు పంపినందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపిపి మాణిక్య రెడ్డి, పార్టీ నాయకులు కీసర పాపయ్య, శ్రీనివాస్, కనకరాజు, రవీందర్ రెడ్డి, వెంకటేశం, వేణు తదితరులు ఉన్నారు.