Sunday, January 19, 2025

ఈ తీర్పు విలక్షణం!

- Advertisement -
- Advertisement -

ఓటర్ల మదిలో ఏముంటుందో, ఎవరికి, ఎందుకు పట్టం గడతారో ఊహించడం కష్టసాధ్యమైన విషయమని మరొకసారి నిరూపితమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తాజాగా జరిగిన జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ఒకటి రెండు మినహా మిగిలిన సర్వే సంస్థలన్నీ గంపగుత్తగా హర్యానాలో కాంగ్రెస్‌కు పట్టం కట్టగా, జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని తేల్చేశాయి. కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వమ్ము చేస్తూ, ప్రజలు వినూత్నమైన తీర్పునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి, హర్యానాలో మరొకసారి బిజెపికి అధికారాన్ని అప్పగిస్తూ తీర్పు చెప్పారు.

దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజలు సెప్టెంబర్ 18- అక్టోబర్ 1 మధ్య మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు అటు ప్రాంతీయ పార్టీలకు, ఇటు జాతీయ పార్టీలకు కూడా సవాల్‌గా నిలిచాయి. జమ్మూకశ్మీర్‌లో ఏళ్ల తరబడి ప్రాంతీయ పార్టీలే ఆధిపత్య చెలాయిస్తూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అబ్దుల్లాలు, ముఫ్తీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఈసారి వీటితో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల ప్రభావం కూడా బాగా కనిపించింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంతో రాజకీయ సమీకరణలు కూడా మారాయి.

జాతీయ సమగ్రత, భద్రత దృష్ట్యా తాము తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఉజ్వల భవితను ప్రసాదిస్తుందని బిజెపి సగర్వంగా చెప్పుకోగా, ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ గట్టిగా ప్రతిఘటిస్తూ, అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. నిరుద్యోగం, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ధరల పెరుగుదల వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌ను కాదని విడిగా పోటీ చేసి పరాజయం పాలైన కాంగ్రెస్ ఈసారి ఎన్‌సితో జత కట్టి బరిలోకి దిగడం లాభించింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఇక 2014లో పిడిపి తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి ఈసారి విడిగా పోటీ చేసి, గతంలో కంటే ఎక్కువ సీట్లనే సంపాదించుకుంది. ఈసారి పిడిపి అంతగా ప్రభావం చూపకపోగా, జమ్మూకశ్మీర్, హర్యానాలలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్.. దోడా స్థానం నుంచి గెలిచి కశ్మీర్‌లో ఖాతా తెరిచింది. సోపోర్ ప్రాంతంలోని 10 నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల్ని పోటీకి నిలిపిన జమాతే ఇస్లామీ (జమ్మూకశ్మీర్) ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో అంతగా కనిపించలేదు.

హర్యానాలో రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బిజెపి, హ్యాట్రిక్ సాధించడం విశేషమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి, సైనీకి ఆ పదవి కట్టబెడుతూ బిజెపి చేసిన ప్రయోగం వికటించింది. అంతకు ముందు పదికి పది స్థానాలు గెలుచుకున్న బిజెపి, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనీ, కాంగ్రెస్ గెలుపు ఖాయమనీ ప్రచారం జరిగింది. దీంతో కమలనాథులు హర్యానాలో గెలుపుకోసం చెమటోడ్చారు.

జాట్లలో అధిక సంఖ్యాకులు కాంగ్రెస్‌కు మద్దతు పలకడంతో మిగిలిన కులాల ఓట్లు రాబట్టేందుకు బిజెపి రచించిన వ్యూహాలు ఫలించాయనడానికి తాజా ఫలితాలే నిదర్శనం. గడచిన లోక్‌సభ ఎన్నికల్లో ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ నినాదంతో పోటీ చేసిన బిజెపి, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించలేకపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లో ఓటమిని మూటగట్టుకుని, హర్యానాలో మూడో దఫా గెలిచిన కమలనాథులకు ముసళ్ల పండుగ ముందుంది. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు, వచ్చే ఏడాది బీహార్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి నేతల వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడవలసిందే. వీటితో పాటు ఉత్తరప్రదేశ్‌లో పది అసెంబ్లీ సీట్లకు త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు కూడా ఆసక్తి గొలుపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News