వాకౌట్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నిరసనలు తెలిపినప్పటికీ, అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం మంగళవారం చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు- 2022ను ఆమోదించింది. బలవంతం, మితిమీరిన ప్రభావం లేదా ఆక్షర్షణ ద్వారా మతమార్పిడులను నిరోధించే బిల్లును మార్చి 4న ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రుజువు బాధ్యత నిందితుడిపై ఉంటుంది. ప్రలోభపెట్టి, బలవంతంగా, మోసపూరితంగా మతమార్పిడి చేస్తే ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు తగ్గకుండా జరిమానా విధించే నిబంధన ఉంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి బిల్లులు ఆమోదం పొందాయి.
మైనర్‌ను, స్త్రీని లేదా ఎస్సీ,ఎస్టీ తెగలకు చెందిన వ్యక్తిని మతం మార్చినా, మార్చడానికి ప్రయత్నించినా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ కాలం జైలు శిక్ష విధించబడుతుందని బిల్లు పేర్కొంది. దీనిని 10 సంవత్సరాల వరకు కూడా పొడగించవచ్చు. అంతేకాక రూ. 3 లక్షల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించొచ్చు. కాగా పలువురు కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఈ బిల్లును ‘రాజ్యాంగ విరుద్ధం’ అన్నారు. సమాజాన్ని మతప్రాతిపదికన చీల్చే ప్రయత్నమన్నారు. విధానసభ స్పీకర్ గ్యాన్ చంద్ గుప్తా ‘నివారణ చర్యలుగా కొన్ని చర్యలు కూడా తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఇదిలావుండగా హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ ‘ఇప్పటికే ఉన్న చట్టాలలో బలవంతంగా మతమార్పిడులకు శిక్షపడే నిబంధన ఉంది, తాజా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు’ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిరణ్ చౌదరి బిల్లును ఆమోదించడం గురించి మాట్లాడుతూ ‘హర్యానా చరిత్రలో ఒక నల్ల అధ్యాయం’ అన్నారు.