చండీగఢ్‌పై హక్కులు వదులుకునే ప్రసక్తి లేదు
ఎస్‌వైఎల్ కెనాల్ నీటిలో మా వాటా ఇవ్వండి
పంజాబ్‌లోని హిందీ ప్రాంతాలు మావే
హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తమకు పూర్తిగా అప్పగించాలన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండును హర్యానా అసెంబ్లీ మంగళవారం ముక్తకంఠంతో ఖండించింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్‌ను తమకు తక్షణమే బదలాయించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలో ఏర్పడిన పంజాబ్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానంపై చర్చించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. చండీగఢ్‌ను పంజాబ్‌కు చండీగఢ్‌ను బదలాయించే అంశాన్ని వెంటనే కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని సిఫార్సు చేస్తూ పంజాబ్ అసెంబ్లీ ఏప్రిల్ 1వ తేదీన ఆమోదించిన తీర్మానంపై తాము ఆందోళన చెందుతున్నట్లు హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ ప్రతిపాదన హర్యానా ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌పై తమ హక్కును వదులుకునే ప్రసక్తి లేదని హర్యానా అసెంబ్లీ ముక్తకంఠంతో స్పష్టం చేసింది. అంతేగాక..రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న సమస్యలు కొలిక్కివచ్చేవరకు చండీగఢ్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని తన తీర్మానంలో హర్యానా కేంద్రాన్ని కోరింది.
ఎంతోకాలంగా పూర్తి కాని సట్లజ్ యమునా లింక్(ఎస్‌వైఎల్) కెనాల్ ప్రాజెక్టు జలాలలో వాటా ఇవ్వడానికి నిరాకరిస్తున్న పంజాబ్‌కు చెక్ పెట్టేందుకు వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ హర్యానా తీర్మానం ఆమోదించింది. దీంతోపాటు పంజాబ్‌లోని హిందీ మాట్లాడే ప్రాంతాలను తమకు బదలీ చేయాలని డిమాండ్ చేస్తూ కూడా హర్యానా తీర్మానించింది. పంజాబ్ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాకు బదలీ చేయాలన్న వాదనను ఇందిరా గాంధీ ఒప్పందం, రాజీవ్–లాంగోవాల్ ఒప్పందం, వెంటక్రామయ్య కమిషన్ ఆమోదించాయని హర్యాన అసెంబ్లీ స్పష్టం చేసింది. చండీగఢ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ హర్యానా రాజధానిగానే ఉంటుందని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు సైతం తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధాని, హర్యానా గవర్నర్ వద్దకు ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకెళితే తాము కూడా కలిసివస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే..ఇటీవల పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం విశేషం. చండీగఢ్‌ను పంజాబ్‌కు బదలాయించాలన్న తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులు కూడా గట్టిగా మద్దతు పలకడం గమనార్హం.