Monday, January 20, 2025

బిజెపికి సవాల్ విసురుతున్న హర్యానా

- Advertisement -
- Advertisement -

కిందటిసారి 2019 అక్టోబరులో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి మెజారిటీ రాలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 40 గెలుచుకుంది. దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన్నాయక్ జనతా పార్టీకి 10 సీట్లు లభించాయి. దీంతో బిజెపి, జన్నాయక్ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మనోహర్‌లాల్ ఖట్టర్ తొలిసారి హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే బిజెపి, జెజెపి మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా కాలం ఈ విభేదాలు నడిచాయి. అయితే చివరకు ఈ ఏడాది మార్చి నెలలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హర్యానా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న విషయాన్ని బిజెపి అధిష్టానం గుర్తించింది. రైతుల ఆందోళన, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం వంటి అంశాలతోపాటు పదేండ్ల పాలనపై సహజంగా ఉండే ప్రజావ్యతిరేకత బిజెపికి మైనస్‌గా మారాయి.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి సవాల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అగ్నిపథ్ పథకం, బిజెపికి మైనస్ పాయింట్‌గా మారనుంది. అగ్నిపథ్ మెరికల్లాంటి యువతకు సైన్యంలో కొలువులు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే సైన్యంలో కొలువు అంటే ఓ ఇరవై ఏళ్లో లేదా పాతికేళ్లో అని అందరూ భావిస్తారు. కనీసం పదిహేనేళ్లు అయినా ఉంటుందని ఆశిస్తారు. అయితే అగ్నిపథ్ పథకంలో కేంద్రం ఇచ్చే ఉద్యోగం కేవలం నాలుగేళ్లే ఉంటుంది. పదిహేడు నుంచి ఇరవై ఒక్క ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువకులు ఈ పథకానికి అర్హులు. విద్యార్హతలు కూడా పెద్దగా అవసరం లేదు. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి పాసయితే చాలు. అగ్నిపథ్‌కు ఎంపికైన వాళ్లను వాళ్లవాళ్ల అర్హతలను బట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఎందులోనైనా భర్తీ చేస్తారు. సర్వీస్ కేవలం నాలుగేళ్లే అయినా వేతనం మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. మొదటి ఏడాది నెలకు ముప్ఫయి వేలు ఇస్తారు. రెండో ఏడాది ముప్పయి మూడు వేలు ఇస్తారు. మూడో ఏడాది అయితే ముప్ఫయి ఆరు వేల అయిదు వందల వేతనం ఉంటుంది. ఇక చివరగా నాలుగో ఏడాది నెలకు నలభై వేలు వేతనంగా ఇస్తారు.

అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొలువులు చేసేవారిని అగ్నివీరులుగా పిలుస్తారు.నాలుగేళ్ల సర్వీస్‌కు కార్పస్ ఫండ్ కింద కొంత అమౌంట్ కూడా జమ చేస్తారు. అయితే నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తరువాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే అగ్నివీరులు నిరుత్సాహపడకుండా వారికి భవిష్యత్తులో అనేక అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశ పెడుతున్నారు. ఇందు కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకపోవడం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన అగ్నివీరులకు ఆ తరువాత ఎటువంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. అంతిమంగా సైన్యంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదు. భారత సైన్యంపై సిబ్బంది వేతనం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా అగ్నిపథ్ పథకాన్ని రూపొందించింది కేంద్రం. హర్యానాలోని మెజారిటీ యువకులు స్కూల్ ఫైనల్ పాసవ్వగానే సైన్యంలోకి భర్తీ అవడానికి ప్రయత్నిస్తారు.

దాదాపు ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తయిన తరువాత అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులులాగే పెన్షన్ సౌకర్యానికి అర్హులవుతారు. అయితే కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించిన అగ్నిపథ్ పథకంలో పెన్షన్ సౌకర్యం ఉండదు.అంతేకాదు నాలుగేళ్ల సర్వీసు తరువాత మళ్లీ కొత్తగా ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. దీంతో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై హర్యానా యువత ఆగ్రహంతో రగిలిపోతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు తొమ్మిదిన్నరేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తప్పించి ఇటీవల నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. ఇదిలా ఉంటే ప్రజలను ఆకర్షించడమే పనిగా వరాలు ప్రకటించి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ అయిన ఫార్ములానే హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు రూ.6,000 పింఛను, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీలు ఇచ్చింది. బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. కాగా ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి. దాదాపుగా అన్ని సీట్లలో బిజెపి, కాంగ్రెస్, జెజెపి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయి. ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి ఉన్న క్లీన్ ఇమేజ్‌పైనే బిజెపి ప్రధానంగా ఆధారపడుతోంది. అంతేకాదు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం కూడా దానికి ప్లస్ పాయింట్‌గా మారింది. డబుల్ ఇంజన్ నివాదంతో దూసుకుపోవాలని బిజెపి భావిస్తోంది. అయితే బిజెపిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఏమేరకు తగ్గుముఖం పడుతుందన్నది వేచి చూడాల్సిందే.

ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News