కొవిడ్ మరణాలపై హర్యానా సిఎం ఖట్టర్
చండీగఢ్ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మరణాల గురించి ఆందోళన చెందడంలో అర్థం లేదన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గగ్గోలు పెట్టినప్పటికీ మరణించినవారు మళ్ళీ బతికిరారని చెప్పారు. ప్రజలను కాపాడటం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం అవసరమని, రోగుల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మనం గణాంకాలపై ఆందోళన చెందకూడదన్నారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటాను 162 మెట్రిక్ టన్నుల నుంచి 240 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందిని తాము ఎదుర్కొనడం లేదన్నారు. ప్రస్తుత ధోరణిని పరిశీలించి, కోటాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జంషెడ్‌పూర్ నుంచి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించినట్లు తెలిపారు.