హైదరాబాద్ : రోజుకు ఏడెనిమిది లీటర్లకే పాడి పశువులు ఆపసోపాలు పడుతుంటాయి. హర్యానాకు చెందిన ఒక ఆవు ఏకంగా రోజుకు 80లీటర్ల పాల దిగుబడితో అందరినీ ఔరా అనిపించి ఆసియాలోనే రికార్డు సాధించింది. హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన పాలదిగుబడి పోటీల్లో షకిరా మిల్కింగ్ చాంపియన్ అనే ఆవు ఈ సరికొత్త రికార్డును నెలకొల్పింది. హోల్ స్టైన్ ఫ్రీజన్ జాతికి చెందిన ఈ ఆవు 145 సెంటీమీటర్లు ఎత్తు, 165 సెంటీమీటర్లు పొడవుతో చూపరులను కట్టిపడేసింది.
పాడిపశువుల పోటీల్లో పాల్గొన్న ఈ ఆవునుంచి రోజులో 8గంటల విరామంతో మొత్తం మూడుసార్లు యం త్రాల సహాయంతో పాలు పితికారు. మూడు పర్యాయాల్లో మొత్తం 80లీటర్లకు పైగానే పాలు ఇచ్చింది.దీంతో ఈ ఆవు ఇప్పటివరకూ ఆసియాలోనే అత్యధికంగా పాలు ఇచ్చిన రికార్డును సొంతం చేసుకుంది. డిఎఫ్‌ఐ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ ఆవును పెంచుతున్న యజామాని సునిల్ మీడియాతో మాట్లాడుతూ అన్ని పశువుల్లాగే ఆవుకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి మేతగా వేస్తామని తెలిపారు.