Friday, December 20, 2024

హర్యానాలో అనిశ్చితి!

- Advertisement -
- Advertisement -

దేశంలో అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చడంలో ఆరితేరిన బిజెపికి హర్యానాలో ఇలాంటి దెబ్బే తగిలింది. గడిచిన నాలుగేళ్లుగా హర్యానాలో సుస్థిరంగా ఉన్న బిజెపి ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురైంది. బిజెపికి చెందిన ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వేళ మైనారిటీలో పడిపోయింది. ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు హఠాత్తుగా బిజెపికి షాక్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ కాంగ్రెస్ శిబిరంలో చేరారు. దీనితో మెజారిటీలు తారుమారై నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

మెజారిటీకి రెండు సీట్ల దూరంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించడానికి బలపరీక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆ రాష్ట్రంలో ఒకప్పటి మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా లేఖ రాశారు. మరోవైపు ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత భూపేంద్ర సింగ్ కూడా రాష్ట్రంలో మైనారిటీలో పడిపోయిన సైనీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హర్యానా రాజకీయాల్లో కీలకమైన నేతగా ఉన్న దేవీలాల్ మనవడైన దుష్యంత్ చౌతాలా కొద్ది రోజుల క్రితం వరకు సైనీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సీట్ల విషయంలో విభేదాలు రావడంతో కూటమి నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని చౌతాలా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు. దీనితో హర్యానా రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది.

గవర్నర్ దత్తాత్రేయ కోర్టులో బంతి ఉంది. ఆయన బలపరీక్షకు ఆదేశిస్తారా లేదా అనే విషయమై ఉత్కంఠ పరిస్థితి అక్కడ నెలకొంది. హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 సీట్లు ఉన్నా ప్రస్తుత సంఖ్యాబలం 88 ఇందులో మెజారిటీ మార్కు అంటే 45 సభ్యుల బలం ఉండాలి. కాని ఆశ్చర్యంగా ప్రస్తుత అసెంబ్లీలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీకి సొంత బలం 40 సీట్లు కాగా, ఒకరు లోక్‌హిత్ పార్టీ నుంచి మరో ఇద్దరు స్వతంత్రులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అంటే ఆయన బలం 43. ఇక కాంగ్రెస్ వైపు చూస్తే ఆ పార్టీ అసలు సభ్యుల సంఖ్య 30 కాగా, కొత్తగా స్వతంత్రులు ముగ్గురు కాంగ్రెస్ శిబిరంలో చేరారు. చౌతాలా నేతృత్వంలోని 10 మంది కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ బలం కూడా బిజెపిలానే 43లా సమానంగా ఉంది. ఎవరు బలం నిరూపించుకోవాలన్నా మరో ఇద్దరు సభ్యుల మద్దతు కూడగట్టాలి. అయితే ఇదంతా గవర్నర్ దత్తాత్రేయ బల పరీక్షకు అనుమతిస్తే నెంబర్ గేమ్ ప్రారంభమవుతుంది.

కాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి చెందిన దత్తాత్రేయ బల పరీక్షకు అనుమతిస్తారా లేదా అన్నది తెలియడం లేదు. 45 సీట్ల నెంబర్‌ను చేరడానికి అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పక్షాలు హోరాహోరీగా ప్రయత్నాలు సాగించడంతో హర్యానా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అయినా ఇంతటి పరిస్థితిలు ఏర్పడినా సైనీ మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు. తనకు అసెంబ్లీలో బలం ఉందని ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. కాని కాంగ్రెస్, జననాయక్ జనతా పార్టీలు గవర్నర్‌పై మైనారిటీ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి.

ఇంత కాలం అనేక రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ కాషాయం’ పేరిట విపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చి అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న బిజెపికి ఇది జీర్ణించుకోలేని పరిణామం. దేశమంతటా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరమైన తరుణంలో హర్యానా రాజకీయ సంక్షోభంపై ప్రధాని మోడీగాని, సెకండ్‌గా ఉన్న అమిత్ షా గాని స్పందించలేదు. గవర్నర్ దత్తాత్రేయ కూడా ఈ విషయంలో కేంద్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా అక్కడి రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. నిజానికి హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను బిజెపి కొద్ది కాలం క్రితమే ప్రజా వ్యతిరేకతతో మార్చి సైనీకి పగ్గాలు అప్పజెప్పింది.

కాని అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా బిజెపి నియంత్రణలోకి రాలేదు. జననాయక్ నుంచి ఆ ప్రభుత్వానికి ప్రమాదం ఎదురైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి దుష్యంత్ పార్టీలో చీలిక తెచ్చి ముగ్గురిని లోబర్చుకుంటే బలపరీక్షలో విశ్వాసాన్ని పొందవచ్చు. ఒకవేళ బలపరీక్షలో రెండు పక్షాలకు సమాన ఓట్లు వస్తే గవర్నర్ అతి పెద్ద పార్టీగా ఉన్న బిజెపికి త్రిశంకు సభలో పది రోజులు అవకాశం ఇవ్వాలి. ఆలోపు అతి పెద్ద పార్టీ మెజారిటీ నిరూపించుకోకపోతే అసెంబ్లీని రద్దు చేయాలి. అయితే దత్తాత్రేయ ఏమి చేస్తారన్నదే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News