Thursday, December 19, 2024

ఉద్యమం.. ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధన తో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆం దోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ 21ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెం దాడు. ఈ ప్రాంతంలోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి రణరంగాన్ని తలపించింది. పంజాబ్ నుంచి త తరలివచ్చిన రైతులను హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరీ వద్ద పోలీసులు, భద్రతా బలగాలు అటకాయించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. ముందుకు సాగేందుకు యత్నించారు. దీనితో వీరిని చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. పలు భద్రతా వలయాలను ఛేదించుకుంటూ, బారికేడ్లను తీసివేస్తూ రైతులు ముందుకు సాగడంతో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు రణరంగం అయింది. వీరిని నిలువరించేందుకు మధ్యాహ్యానికి మూడు సార్లు భాష్పవాయువు ప్రయోగించారు. ఇక్కడనే టియర్‌గ్యాస్ ప్రయోగానికి డ్రోన్లను కూడా వాడారు. దీనితో రైతులు భాష్పవాయువు నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీయాల్సి వచ్చింది. కనౌరిలో కూడా పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. రైతులను చెదరగొట్టారు. ఈ ప్రాంతం పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ముందుకు వెళ్లుతున్న రైతులు, అక్కడి హర్యానా పోలీసు, భద్రతా బలగాల నడుమ దాదాపుగా సంకుల సమరం జరిగింది.

ఘర్షణల నడుమ తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు రైతులలో ఒక్క రైతు శుభ్‌కరణ్‌సింగ్ అప్పటికే చనిపోయి ఉన్నాడని పాటియాలలోని రాజీందర్ర ఆసుపత్రి ఉన్నతాధికారి హెచ్‌ఎస్ రేఖీ విలేకరులకు తెలిపారు. కనౌరీ సరిహద్దుల నుంచి గాయపడ్డ వారిని ఈ ఆసుపత్రికి తరలించారు. తమ వద్దకు తీసుకువచ్చిన రైతులలో శుభ్‌కరణ్ సింగ్ తలకు గాయం అయి ఉందని రేఖీ వివరించారు. ఇప్పుడు మృతి చెందిన రైతుది పంజాబ్‌లోని భటిండా జిల్లా బలోకే గ్రామం అని రైతు నేత బల్దేవ్ సింగ్ సిర్సా తెలిపారు. తమ ఆందోళన దశలో రైతు మృతి ఇది మొదటిదని రైతు నేతలు తెలిపారు. హర్యానా పోలీసులు రైతులపై జులుం సాగించారని, ఓ భాష్పవాయువు, మరో వైపు రబ్బర్ బుల్లెట్లు వాడారని మండిపడ్డారు. రైతులు మాస్క్‌లు ధరించి , కళ్లద్దాలు పెట్టుకుని తమను తాము పొగనుంచి రక్షించుకునేందుకు యత్నించారు. రైతుల కదలికలను పసికట్టేందుకు పలు చోట్ల డ్రోన్లను రంగంలోకి దింపారు. ఇవి ఆకాశంలో చక్కర్లు కొడుతూ కన్పించాయి. పలు ప్రాంతాలలో రైతుల నేతలు అంతా శాంతియుతంగా ఉండాలని కోరడం కన్పించింది.

అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటింది. యువరైతులు ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగకుండా రైతునేతల ప్రతినిధులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. రైతులు తమ ముందున్న బారికేడ్లను తొలిగించుకుంటూ హర్యానాలోకి దూసుకువచ్చేందుకు యత్నించడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు నాలుగో విడత కూడా విఫలం అయ్యాయి. దీనితో రెండు రోజుల విరామం తరువాత వేలాది మంది రైతులు ముందుకు కదిలారు. పంటలకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, పంటరుణ మాఫీల ప్రకటన రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ స్పందన సరిగ్గా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట ఎంచుకున్నారు. రైతుల ఢిల్లీ చలో ఈ నెల 13వ తేదీన ఆరంభం అయింది. అప్పటినుంచి రైతులు శంభు ఇతర సరిహద్దులలో ట్రక్కులు, ట్రాక్టర్లు, మినీవ్యాన్లలో మొహరించుకుని ఉన్నారు. రైతుల వద్ద ఉన్న పనిముట్లు తమకు ప్రమాదకారిగా ఉన్నాయని, రైతులు ముందకు సాగకుండా చేయడమే తమ ముందున్న తక్షణ ఆలోచన , కర్తవ్యం అని భద్రతా బలగాలు నిర్ణయించుకున్నాయి. అధికార యంత్రాంగం నుంచి కూడా ఈ దిశలో స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయని వెల్లడైంది.

ఐదో దఫా చర్చకు రండి
కేంద్ర మంత్రి ముండా పిలుపు
కాగా రైతులు శాంతియుతంగా ఉండాలని, సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవల్సి ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా పిలుపు నిచ్చారు. రైతుల ప్రతినిధులతో చర్చలకు దిగిన త్రిసభ్య మంత్రుల బృందంలో ముండా కీలక పాత్ర వహించారు. అన్ని విషయాలను చర్చించుకోవచ్చునని, ఐదో దఫా చర్చలకు రావాలని పిలుపు నిచ్చారు. ఎంఎస్‌పి ఇతర ఏ విషయాలపై అయినా చర్చలతో పరిష్కారం కుదురుతుందని, దీనిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
విజయం కోసం సంయమనం అవసరం
రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పిలుపు
ఉద్రిక్తతల నడుమనే రైతుల నేత జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ రైతులను ఉద్ధేశించి మాట్లాడారు. మనమంతా శాంతియుతంగా క్రమశిక్షణతో ఉండాలని కోరారు. గెలుపు కావాలంటే సంయమనం అవసరం అని, గెలుద్ధామా ? వద్దా? అని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని దెబ్బతీసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంయమనంతోనే విజయం వస్తుందని తెలిపారు. ఇంతకు ముందు రైతుల ఉద్యమం విజయవంతం అయిందని గుర్తు చేశారు. ఉద్యమం శాంతియుతంగా ఉంటుందని అంతకు ముందు విలేకరుల సమావేశంలో ఈ నేత తెలిపారు. శాంతిని భగ్నపర్చడం తమ ఉద్ధేశం కాదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News