Wednesday, January 22, 2025

చావో రేవో.. ఆయుధాలు పట్టండి

- Advertisement -
- Advertisement -

పల్వాల్ : ఇప్పుడు చావో రేవో పరిస్థితి ఏర్పడిందని, ఇక రక్షణకు హిందూ సమాజం ఆయుధాలు చేపట్టాలని హిందూ సంస్థ హర్యానా గోరక్షక్ దళం మహాపంచాయతీ పిలుపునిచ్చింది. ప్రత్యేకించి హిందూ యువత సర్వం సమాయత్తంగా ఉండాలని , చేతుల్లో ఆయుధాలతోనే తిరగాలని తెలిపారు. హర్యానాలో గత నెల చివరిలో నూహ్ ఇతర ప్రాంతాలలో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నూహ్ పల్వాల్ సరిహద్దుల్లో జరిగిన అత్యవసర భేటీలో గో రక్షక్ దళం అధినేత ఆచార్య ఆజాద్ శాస్త్రి ప్రసంగించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మన దిక్కు మనమే వెతుక్కోవడం ధర్మం అని వ్యాఖ్యానించారు. జులై 31వ తేదీన నూహ్ రణరంగంగా మారింది. దీనిపై చర్చించుకునేందుకు హిందూ సంస్థ పల్వాల్‌లో మహాపంచాయితీ నిర్వహించు కునేందుకు పోలీసులు అనుమతిని ఇచ్చారు.  జులై 31న విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అనుబంధంగా బృజ్‌మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించారు.

ఈ దశలో రాళ్లు పడ్డ ఘటనతో యాత్ర నిలిచిపోయింది. తరువాత హింసాత్మక ఘటనలు చెలరేగాయి. తిరిగి విహెచ్‌పి యాత్ర పునరుద్ధరణ గురించి చర్చించుకునేందుకు ఇప్పుడు గోరక్షక్ సంస్థకు అనుమతిని ఇచ్చారు. అయితే పలు షరతులతో వీరికి అనుమతిని ఇచ్చినట్లు, రెచ్చగొట్టే ప్రసంగాలకు దిగరాదని కట్టడి విధించామని స్థానిక ఎస్‌పి లోకేందర్ సింగ్ తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా పసికట్టి, తగు విధంగా చర్యలు చేపడుతారని వివరించారు. ఇటువంటి సమావేశం నిర్వహణకు అంతకుముందు నూహ్ అధికారులు నిరాకరించారు. తరువాత అనుమతి విషయాన్ని పల్వాల్ ఎస్‌పి ధృవీకరించారు. ఇందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో జరిగిన మహాపంచాయతీలో హిందూనేతలు ఆయుధాలు ధరించాలని పిలుపు నివ్వడం వివాదాస్పదం అయింది. ఉద్రిక్తతల ప్రాంతంలో మరింత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News