Monday, December 23, 2024

హర్యానాలో సైనీ సర్కారుకు లైన్‌క్లియర్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హర్యానా అసెంబ్లీలో నాయబ్ సింగ్ సైనీ సారధ్యపు ప్రభుత్వం విశ్వాస తీర్మాన ఓటులో గెల్చింది. బుధవారం మూజువాణి ఓటు ప్రక్రియలో సభ నాయబ్ సర్కారుపై విశ్వాసం ప్రకటించింది. అంతకు ముందు తీర్మానంపై సభలో రెండు గంటల పాటు చర్చ జరిగింది. 90 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపికి 41 ఎమ్మెల్యేల బలం ఉంది. ఏడుగురు ఇండిపెండెంట్లలో ఆరుగురి మద్దతు పొందింది.

ఏకసభ్య లోక్‌హిత్ పార్టీ తోడ్పాటు అందింది. కాగా ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌కు సభలో 30 మంది సభ్యులు ఉన్నారు. కాగా జననాయక్ జనతా పార్టీ (జెజెపి)కి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఓటింగ్ దశలో గైర్హాజరు కావాలని పార్టీ తరఫున విప్ వెలువడింది. అయితే వీరిలో ఐదుగురే సభ నుంచి నిష్క్రమించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు చకచకా బిజెపి పావులు కదిపింది. సిఎం ఎంఎల్ ఖట్టర్‌ను మార్చివేసింది.

ఎమ్మెల్యే స్థానానికి ఖట్టర్ రాజీనామా

పదవీచ్యుతుడైన మాజీ సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తమ కర్నాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ స్థానం బాధ్యతను సిఎం చూసుకుంటారని ప్రకటించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో నాయబ్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన వెంటనే ఖట్టర్ తమ స్థానానికి రాజీనామా వెల్లడించారు. కాగా ఆయన ఎంపిగా పోటీ చేయనున్నట్లు వెల్లడైంది. తాను సుదీర్ఘకాలంగా సభా నేతగా పనిచేస్తూ వస్తున్నానని, ఇకపై కూడా ఇదే విధంగా ప్రజాసేవలో తుది శ్వాస వరకూ ఉంటానని ప్రకటించారు. కాగా పదవి మార్పు గురించి ప్రస్తావిస్తూ ‘మార్పు జీవన ప్రక్రియలో ఓ భాగం. పలు విధాలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News