న్యూఢిల్లీ : హర్యానా భూములకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వాణిజ్యవేత్త, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బావగారు రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం ప్రశ్నించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తనను ఇడి సమన్ చేయడాన్ని ‘రాజకీయ కక్షపూరితం’గా వాద్రా ఆక్షేపిస్తూ, ఇంతకుముండు ఇడి ప్రశ్నించినప్పుడు తాను గంటల తరబడి సంస్థ ముందు కూర్చున్నానని, వేలాది పేజీలు పంచుకున్నానని, కానీ ఇప్పటికీ ఆ సంస్థ తనపై కేసులు రేకెత్తిస్తోందని ఆరోపించారు. 56 ఏళ్ల వాద్రా మధ్య ఢిల్లీలో సుజన్ సింగ్ పార్క్ ప్రాంతంలోని తన నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎపిజె కలామ్ రోడ్‌లోని ఇడి ప్రధాన కార్యాలయానికి నడుస్తూ వెళ్లారు. ఇడి కార్యాలయానికి వెళుతూ దారిలో విలేకరులతో వాద్రా మాట్లాడుతూ, ‘ఇది రాజకీయ కక్ష తప్ప వేరేమీ కాదు.
మైనారిటీల కోసం నేను మాట్లాడినప్పుడల్లా వారు నన్ను నిలువరించే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని అణగదొక్కుతారు& వారు పార్లమెంట్‌లో రాహుల్ (గాంధీ)ని కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది సంస్థలను దుర్వినియోగం చేయడమే, ఇది రాజకీయ కక్షే’ అని ఆరోపించారు. ‘గతంలో వలె వారితో నేను సహకరిస్తాను’ అని వాద్రా చెప్పారు. వాద్రాను మొదట ఈ కేసులో ఈ నెల 8న సమన్ చేసినట్లు, కానీ ఆయన విచారణకు రాకుండా సరికొత్త తేదీని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కేరళ వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా భర్త అయిన రాబర్ట్ వాద్రాపై దర్యాప్తు హర్యానా శికోహ్‌పూర్‌లోని ఒక భూముల ఒప్పందంతో ముడిపడినది.
దర్యాప్తు 2008 ఫిబ్రవరిలో ఒక భూముల ఒప్పందానికి సంబంధించినది. వాద్రా ఆధ్వర్యంలోని స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7.5 కోట్ల ధరకు ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సంస్థ నుంచి గురుగ్రామ్‌లోని శికోహ్‌పూర్‌లో 3.5 ఎకరాల స్థలం కొనుగోలుకు సంబంధించినది ఆ ఒప్పందం. ఆ భూమి మార్పు కొన్ని గంటల్లోనే జరిగిందనే ఆరోపణ వచ్చింది. హర్యానా పోలీసులు 2018లో ఆ ఒప్పందంపై ఒక కేసు దాఖలు చేశారు. ఇడి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఆయన వాఙ్మూలాన్ని నమోదు చేస్తుందని అధికార వర్గాలు తెలియజేశాయి. వేరే మనీ లాండరింగ్ కేసులో ఇడి వాద్రాను అనేక సార్లు ప్రశ్నించింది.