Thursday, January 23, 2025

హర్యానా దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేతకు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

Haryana ordered to stop production of cough medicine

సంచలనం కలిగించిన గాంబియా చిన్నారుల మృతి
దగ్గు తయారీ కేంద్రంలో 12 లోపాల గుర్తింపు
నవంబర్ 14 లోగా వివరణ ఇవ్వాలని మైడెన్ సంస్థకు నోటీసులు

చండీగఢ్ : దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. హర్యానా లోని సొనెపట్ కేంద్రంగా మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హర్యానా ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు ప్రారంభించింది. చట్టపరమైన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌ను ఆదేశించింది. తనిఖీల సమయంలో సొనెపట్ లోని మైడెన్‌కు చెందిన దగ్గుమందు తయారీ కేంద్రం లోని లోపాలను హర్యానా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై సంస్థకు చెందిన తయారీ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో మైడెన్ నవంబర్ 14 లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్పత్తులను నిలిపేసినట్టు హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆ కంపెనీకి సంబంధించి మూడు ఔషధాలను పరీక్ష నిమిత్తం కలకత్తా లోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపారు. ఆ పరీక్ష నివేదిక తదనంతరం ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటామని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.

కేంద్ర, హర్యానా రాష్ట్ర ఔషధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 12 లోపాలను గుర్తించడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్టు చెప్పారు. దగ్గు మందు తయారీ, టెస్టింగ్‌కు సంబంధించిన పరికరాల లాగ్‌బుక్‌లను నిర్వహించడంలో విఫలమైందని, ప్రొపైలిన్, గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పరాబెన్ బ్యాచ్ నంబర్ల వివరాలు లేవంటూ పలు ఉల్లంఘనలను గుర్తించింది. తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2011లో వియత్నాం ఈ సంస్థపై నిషేధం విధించింది. గాంబియాలో చిన్నారుల మరణాలకు దారి తీసిన కారణాల్లో కిడ్నీలు దెబ్బతినడానికి సిరప్‌లే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ప్రొమైథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్‌కోల్డు సిరప్‌లే కారణాలుగా పేర్కొంది. ఈ మందుల సరఫరా వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఈ సిరప్‌లను ప్రయోగశాలలో పరీక్షించగా, ప్రమాదకర స్థాయిల్లో డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు పేర్కొంది. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లు ఎగుమతికి మాత్రమే అనుమతి పొందాయని, వాటిని భారత్‌లో విక్రయించడానికి, మార్కెటింగ్ చేయడానికి వీల్లేదని ఈ ఘటన అనంతరం హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News