Monday, January 27, 2025

మహిళా అథ్లెట్ కోచ్ లైంగిక ఆరోపణలు… పదవి నుంచి తప్పుకున్న మంత్రి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు క్రీడల మంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా తన పదవీ భాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు మంత్రి సందీప్ సింగ్ ప్రకటించారు. తన ఇమేజ్‌ను చెడగొట్టేందుకే కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు పేర్కొన్నారు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ క్రీడల మంత్రి లైంగిక వేధింపులకు గురి చేశారని హర్యానాకు చెందిన జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆరోపణలు చేశారు. తనను సంతోషంగా ఉంచితే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రలోభ పెట్టారని, అందుకు తాను లొంగక పోవడం వల్ల తనని వేరే చోటుకు బదిలీ చేశారని ఆరోపించారు. దీనిపై డీజీపీ, సిఎం, రాష్ట్ర హోం మంత్రి శాఖ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇటీవల మీడియా ముందు మహిళా అథ్లెట్ కోచ్ వాపోయారు.

ఇలా మంత్రి సందీప్‌సింగ్ చాలా మంది క్రీడాకారిణులను లైంగికంగా వేధించారని, మంత్రికి భయపడి వారెవరూ బయటికి చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమం లోనే మంత్రి బాధ్యతల నుంచి సందీప్‌సింగ్ వైదొలగినట్టు తెలుస్తోంది. కురుక్షేత్ర లోని పెహోవా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ సింగ్ కూడా హాకీ క్రీడాకారుడే. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2018లో సూర్మా పేరుతో ఆయనపై బయోపిక్ కూడా వచ్చింది. ఇందులో పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ సందీప్‌పాత్రను పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News