Monday, December 23, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు పెట్టారా లేదా? పోలీసుల్ని అడిగిన కోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేశారా, లేదా? అని ప్రజా ప్రతినిధుల కోర్టు అడిగింది. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటుగా, సంబంధిత అధికారులు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే, న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. మహబూబ్ నగర్ టౌన్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెంటనే ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మంత్రిపై కేసు నమోదు చేశారా? లేదా? అని అడిగింది. ఒకవేళ కేసు పెట్టి ఉంటే ఎఫ్‌ఐఆర్ తో పాటుగా పూర్తి వివరాలు శుక్రవారం సాయంత్రం లోపు కోర్టు ముందు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్ నగర్ పోలీసులు కనుక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే.. దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.

జూలై 31న హైకోర్టు తీర్పు
మహబూబ్ నగర్ ఎంఎల్‌ఎ వి శ్రీనివాస్ గౌడ్‌పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను జూలై 31న ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసి, తన అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనే మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. మంత్రితో పాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు నమోదు చేయాలని తెలిపింది. వీరిలో ఎన్నికల కమిషన్‌కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర అధికారులు కూడా ఉన్నారు. అయితే, రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టి వేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో హైకోర్టును, ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నాంపల్లి కోర్టులో ఉన్న ఆ కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని గతంలొ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News