ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టి-20లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన పాక్ ఆటగాడు హసన్ నవాజ్ అద్భుతమైన సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్లకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. మార్క్ ఛాప్మాన్(94) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ హసన్ నవాజ్ చెలరేగిపోయాడు. కీపర్ మహ్మద్ హరిస్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యం చేశాడు. అయితే 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హరిస్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా(51) నవాజ్‌కు మంచి సహకారం అందించాడు. దీంతో నవాజ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 45 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 105 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ తరఫున టి-20ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నవాజ్‌తో పాటు అఘా కూడా అద్భుతంగా రాణించడంతో పాకిస్థాన్ 16 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి.. 207 పరుగులు చేసి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-1 తేడాతో న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది.