120 మిల్లీలీటర్ల ఆయిల్, 600 గ్రాముల గంజా స్వాధీనం
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 మిల్లీలీటర్ల హాష్ ఆయిల్, 23 చిన్న బాక్స్‌లు, గంజాయి వేయింగ్ మిషన్, 600 గ్రాముల గంజాయి, బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని లింగంపల్లి, చందానగర్‌కు చెందిన తిరుపూరు రామస్వామి పవన్‌కల్యాణ్ అలియాస్ టిఆర్ పవన్‌కల్యాణ్ అలియాస్ పవన్ బిపిఓలో టెలీకాలర్‌గా పనిచేస్తున్నాడు. చింతల్‌కు చెందిన కుసుమల్ల రాకేష్ అలియాస్ రాకేష్ అలియాస్ నాని నిరుద్యోగి, నిజామాబాద్‌కు చెందిన పురుషరాణి ప్రమోద్‌కుమార్ గౌడ్ గంజాయి విక్రయిస్తుంటాడు.
టిఆర్ పవన్‌కల్యాణ్, ప్రమోద్ గతంలో గంజాయి విక్రయించడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బయటికి వచ్చిన తర్వాత ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకుండా మళ్లీ గంజాయి విక్రయిస్తున్నారు. ఇద్దరు కలిసి ఎపిలోని అరకు నుంచి తక్కువ ధరకు గంజాయి, హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. హాష్ ఆయిల్ చిన్న బాక్స్ రూ.2,000 నుంచి రూ.2,500కు, గంజాయి ప్యాకెట్‌ను రూ.150 నుంచి రూ.250కి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం కంచన్‌బాగ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, ఎస్సైలు శ్రీనివాసులు, ఎండి షానవాజ్ షఫీ తదితరులు పట్టుకున్నారు.