బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి.దేవగౌడ్ మనుమడు, జెడిఎస్ లోక్ సభ సభ్యుడు ప్రజ్వల్ రేవన్న లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో ఇరుకున్నాడు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్కాండల్ దర్యాప్తునకు ‘సిట్’ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. సిట్ ద్వారా దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ కూడా డిమాండ్ చేసింది.
హస్సన్ పార్లమెంటరీ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ్వల్ రేవన్న నిందితుడయినందున దేశం వదిలి పారిపోయాడని వార్త. అతడు మాజీ మంత్రి హెచ్.డి. రేవన్న కుమారుడు.
ఫోను ద్వారా చిత్రీకరించిన కొన్ని మహిళల అశ్లీల వీడియో క్లిప్పులు హస్సన్ లో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వీడియో క్లిప్పులు జెడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు చెందినవని తెలుస్తోంది. అందులో అనేక మంది మహిళలను సెక్స్ కు బలవంతపెట్టినట్లు ఉంది. ప్రజ్వల్ అనేక మంది మహిళలను సెక్స్ కోసం వేధించాడని, వారి వీడియోలు తీశాడని ఆరోపణ.
జెడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దాదాపు 2876 మంది మహిళలను లోబరుచుకున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ కు చెందిన డాక్టర్ నాగలక్ష్మి చౌదరి ఆరోపించారు. ఓ బాధితురాలు మహిళా కమిషన్ వద్ద తన ఫిర్యాదు దాఖలు చేసింది. దానిని హస్సన్ పోలీస్ సూపరింటెండెంట్ కు ఫార్వర్డ్ చేశారు. ఈ కేసులో ఎఫ్ ఐఆర్ దాఖలు కానున్నది.