పాక్ ప్రధానికి హోం మంత్రి సూచన
ఇస్లామాబాద్: వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తాను ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సలహా ఇచ్చినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దరిమిలా దేశంలో ఇమ్రాన్ ఖాన్ పట్ల ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోయిందని రషీద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 202223 సంవత్సరానికి వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తాను చేసిన సూచన తన వ్యక్తిగతమని, దానికి అధికార పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పిటిఐ) పార్టీతో ఎటువంటి సంబంధం లేదని శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో రషీద్ స్పష్టం చేశారు. 2023 చివరిలో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో ఏ ప్రధాని తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న చరిత్ర లేదు. ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఏప్రిల్ 3, 4 తేదీలలో వచ్చే అవకాశం ఉందని రషీద్ తెలిపారు.