చెన్నై : లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. నాగపట్నం లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ “ నవదంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
నియోజక వర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోన్న వేళ ఇప్పుడలా చెప్పలేను. అంతకు ముందు మేం కుటుంబ నియంత్రణపై దృష్టి సారించాం. కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి” అని సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొళత్తూర్ లోని ఓ వివాహ వేడుక లోనూ స్టాలిన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5న స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.