Wednesday, January 22, 2025

రాష్ట్రానికి మంచి చేస్తే మద్దతిస్తాం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంపిలపై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తాం

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంపిలపై కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు, సీలేరు ప్రాజెక్టు విషయంపై పార్లమెంట్‌లో తాము మాట్లాడలేదని కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి చెప్పడం సబబు కాదని, ఆ రోజు పార్లమెంట్‌లో తాము తీవ్ర చర్చకు పట్టుబట్టామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, పార్లమెంట్‌తో తాము మాట్లాడిన వీడియోలను జీవన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో జరిగిన చర్చపై జీవన్‌రెడ్డి మాట్లాడినవన్నీ అసత్యాలని, పార్లమెంటులో చర్చ, తన వ్యాఖ్యలు రెండూ ఒకసారి చూసుకోవాలని అన్నారు.

2014 నుంచి 2023 వరకు కెసిఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చూసుకోవాలని సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజకీయ పరిస్థితులు ఆయనకు అవగాహన అయ్యాయా లేదా అవగాహన లేకుండానే బిఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు చేసేందుకు ఇలా మాట్లాడారా…? అని ప్రశ్నించారు. ఆరోజు పార్లమెంట్ సమావేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో జీవన్‌రెడ్డికి తెలుసని, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా స్పందించకుండా ఉంటే మౌనమే అంగీకారం అంటారని తెలిపారు. ఆరోజు మండలాల కోసం తీవ్రంగా పోరాడి చర్చకు దిగింది తానేనని చెప్పారు. ఆ రోజు జరిగిన చర్చకు సంబంధించిన వీడీయోలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి కలిసి ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లారని, ఆరోజు మోదీ సభకు రాగానే తాను వ్యతిరేకించారని వినోద్‌కుమార్ తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్, ధర్నాలకు పిలునిచ్చారని గుర్తుచేశారు. ఏడు మండలాలు ఎపిలో కలిపినప్పుడు ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్‌ఎస్ పోరాడుతుంది
భూగోళం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా కెసిఆర్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తే తాము మద్దతు ఇస్తామని, కేంద్రం నుంచి ఏం రావాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు బిజెపి ఎంపీలు రాష్ట్రానికి ఒక్క పనైనా చేశారా..? అని నిలదీశారు. గోదావరి, కృష్ణా నదులపైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని కెసిఆర్ వందసార్లు లేఖలు రాశారని, ప్రధానిని కలిశామని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో గొంతుచించుకుని మాట్లాడామని చెప్పారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ సొంత డబ్బులతో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తమ ప్రభుత్వం ప్రారంభించిందని, వాటిని సిఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోవడానికి కారణం ఐదేళ్ల నుంచి కాంగ్రెస్, బిజెపి వాళ్లు చేసిన వ్యాఖ్యలేనని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు ఏది పడితే అది మాట్లాడితే తాము సరిగ్గా తిప్పికొట్టకపోవడం కూడా బిఆర్‌ఎస్ ఓటమికి ఒక కారణమని వినోద్ వ్యాఖ్యానించారు.

Vinod Kumar

Vinod Kumar 3

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News