Friday, December 27, 2024

మీరిన్ని కొలువులిచ్చారా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే మేము 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం

మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచిందని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూసి రాష్ట్రానికి కేంద్రమే ఎన్నో అవార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 30 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధిలోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగిందని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చ ట్టం, కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చి 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించామని తెలిపారు. తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై గురువారం ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

2014కు ముందు ఎట్లుండే తెలంగాణ 2023లో ఎట్లైంది తెలంగాణ అని గణాంకాలు, ఫొటోలతో కెటిఆర్ వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసిందని వెల్లడించారు. సమగ్ర, సమీకృత,సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మోడల్ అని వ్యాఖ్యానించారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కరోనా కారణంగా రెండేళ్లు వృథా కాగా, తాము నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలన చేశామని చెప్పారు. ఈ స్వల్ప కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి, 58 లక్షల ఆవాసాలకు స్వఛ్చమైన తాగునీరు అందించామని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందించకపోతే ఎన్నికల్లో ఓట్లు అడుగను అని సిఎం కెసిఆర్ చెప్పారని, ఈ మాట చెప్పాలంటే నాయకుడికి ఎంతో ధైర్యం ఉండాలని అన్నారు. హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలు నాటామని, తద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని అన్నారు. దేశంలోనే హరిత నిధి ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తలసరి ఆదాయంలో నెంబర్‌వన్
తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా ఉందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, 2023లో రూ.3,17,115 కు చేరిందని వివరించారు. జిఎస్‌డిసి అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 2014లో జిఎస్‌డిపి రూ.5.05 లక్షల కోట్లు ఉండగా, 2023లో రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని, 2014లో తెలంగాణ పేదరికం 13.18 శా తం ఉండగా, 2023లో 5.9 శాతానికి తగ్గించిందని, పేదరికా న్ని అత్యంత తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ మండలాలూ, రెవెన్యూ డివిజన్ల సంఖ్య భారీగా పెంచామని కెటిఆర్ అన్నారు. 33 కొత్త జిల్లాలు చేశామని, 43 ఉన్న రెవిన్యూ డివిజన్లను 74కు, 68 ఉన్న మున్సిపాలిటీలను 74కు పెంచామని, అలాగే 459 ఉన్న మండలాలను 612కు పెంచామని చెప్పారు. అదేవిధంగా 7,855 ఉన్న పంచాయతీలను 12,769కు పెంచామని, తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నామని అన్నారు.
అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కెటిఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చామని, అందులో 2,02,735 నోటిఫై చేశామని చెప్పారు. అందులో ఇప్పటికే 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి కాగా, 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. దేశంలో తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా.. ?…ఒకవేళ ఉంటే తెలంగాణ పిల్లలకు చెప్పండి అని పేర్కొన్నారు. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదు.. ఈ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని సవాల్ విసిరారు. ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండని అన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని, ఆ రాష్ట్రాలను పాలిస్తున్న పార్టీల నాయకులు తెలంగాణకు వచ్చి తమ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్ కూడా ప్రారంభించామని చెప్పారు. ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఐటీ రంగంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీలకు చిరునామా హైదరాబాద్
హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా మారిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా తదితర దిగ్గజ ఐటీ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు 3,23,396 నుంచి 9,05,915కు పెరిగాయని తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడానికి విప్లవాత్మకమైన టిఎస్ ఐపాస్ విధానం తీసుకువచ్చామని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో 24 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేశామని, వీటి ద్వారా రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 24 లక్షల మందికి ఉద్యోగాలు లభించామని వివరించారు. రాష్ట్రంలో 300లకు పైగా పారిశ్రామిక పార్కులు, ఏరోస్పేస్, టెక్స్‌టైల్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. 2014కు ముందు తాంబాలాలుగా ఉండే చెరువులు, 2023 నాటికి గంగాళాలుగా మారాయని చెప్పారు.
ఒకే క్యాంపస్‌లో కెజి టు పిజి విధానం..
పకలతో రండి పట్టాతో పోండి అనేది తమ విద్యావిధానం అని కెటిఆర్ వెల్లడించారు. కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా కెజి నుంచి పిజి వరకు ప్రభుత్వమే విద్యనిందిస్తుందన్నారు. ప్రస్తుతం గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కెజి టు పిజి వరకు అందిస్తున్నామని, ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. 26వేలకు కుపైగా స్కూళ్లలో మౌళిక వసతులు, తరగతి గదులు నిర్మించామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 56 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏర్పాటు చేసిన కాలేజీలు రెండే అని, గతంలో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, బిఆర్‌ఎస్ పాలనలో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయం కోసం మతాన్ని వాడుకునే దౌర్భాగ్య స్థితి తాము లేమని కెటిఆర్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆథ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయని చెప్పారు. రూ.12 వందల కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే కొండగట్టు అంజన్న దేశాలయ అభివృద్ధి రూ.500 కోట్లు కేటాయించామని, వేములవాడ రాజన్న క్షేత్ర విస్తరణకు రూ.700 కోట్లు, ధర్మపురి దేవాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యం, అర్చకులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చి గౌరవిస్తున్నామన్నారు. పుష్కరాలు, బోనాలు, జాతరలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. కరెంటు ఉండదు
సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతులకు 11 విడతల్లో రూ.73 వేల కోట్లు అందించామన్నారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షల ఉచిత బీమా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విధానం ఇతర రాష్ట్రాలలో లేదని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, సోలార్ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటి అని పేర్కొన్నారు. 18,567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 5,347 సోలార్ ఉత్పత్తితో అగ్రగామిగా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే కరెంట్ ఉండదని విమర్శించారు. సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ స్వయంగా ఒక బీడీ కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్నారని, వారి బాధలు చూసి ఎవరూ అడగకపోయినా బీడీ కార్మికులు,ఒంటరి మహిళలు, వృద్థులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తమ మేనిఫెస్టోలు లేకపోయినా తమకు ఎవరూ దరఖాస్తు చేయకపోయినా కళ్యాణలక్ష్మి, దళితబంధు వంటి విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చామని చెప్పారు.
తెలంగాణలో ఐదు విప్లవాలు
రాష్ట్రంలో హరిత విప్లవం ద్వారా ధాన్యం దిగుబడిని 68 లక్షల టన్నుల నుంచి 3.5 లక్షల టన్నులకు పెరిగిందని కెటిఆర్ పేర్కొన్నారు. 2012లో గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు ఉండగా, పింక్ విప్లవం ద్వారా 2019లో 19.1 మిలియన్లకు చేరిందని చెప్పారు. అలాఏగ నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తి 3.90 లక్షల టన్నులకు చేరిందని, శ్వేత విప్లవం ద్వారా పాల ఉత్పత్తి 5.8 మిలియన్ లీటర్లకు చేరిందని అన్నారు. ఇప్పుడు ఆయిల్ పాం సాగును పెంపొందించడానికి ఐదో విప్లవం తీసుకువస్తామని వెల్లడించారు. 2014 తర్వాత 27,376 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు జరిగిందని, దానిని 2025 నాటికి 20 లక్షల ఎకరాలకు పెంపొందిస్తామని కెటిఆర్ తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. షీ టీంలు, భరోసా సెంటర్ల ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. లక్షలాది సిసి కెమెరాలతో నిఘా, అత్యాధునిక వాహనాలు, టెక్నాలజీని ఉపయోగించి భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
మెరుగైన పారిశుద్ధ్య విధానం
రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ్య విధానం అమలు చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. 100 శాతం డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ 2,397 టన్నుల నుంచి 4,295 టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. 21 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని అన్నారు.
హైదరాబాద్‌కు అవార్డుల పంట
హైదరాబాద్‌కు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020, వరల్డ్ గ్రీన్ సిటీ 2022 అవార్డులతో పాటు హైదరాబాద్‌లోని మూడు కట్టడాలకు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డు లభించిందని కెటిఆర్ వెల్లడించారు. వరుసగా ఐదేళ్లు మెర్సర్స్ ర్యాంకింగ్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఉందని, ఫార్ములా ఈ రేసింగ్‌కు వేదికగా నిలిచిందని వ్యాఖ్యానించారు. టిఎస్‌ఐసి, టీ హబ్, వి హబ్, టీ వర్క్, యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతం మెట్రో రైలు 70 కిలో మీటర్ల మేర ఉందని, భవిష్యత్తులో దానిని 415 కిలో మీటర్లకు పెంచుతామని కెటిఆర్ తెలిపారు.
తెలంగాణ యాసకు ప్రాధాన్యత పెరిగింది
ఒకప్పుడు విలన్లు, కమేడియన్లు మాత్రమే మాట్లాడే తెలంగాణ యాసను ఇప్పుడు బాలయ్య బాబు, రామ్‌చరణ్, మహేష్ బాబు వంటి బడా హీరోలు కూడా మాట్లాడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు వెలుగు వెలుగుతున్నాయని, తెలుగు సినిమాలలో తెలంగాణ యాసకు ప్రాధాన్యత పెరిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ కూడా బతుకమ్మ ఆడడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News