మనతెలంగాణ, హైదరాబాద్ : తీగలాగితే డొంక కదిలింది అనే సామెతను నిజం చేసింది వనస్థలిపురం దోపిడి కేసు. కేసు దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు హవాలా రాకెట్‌ను బయటికి తీశారు. పోలీసుల కథనం ప్రకారం…వనస్థలిపురం, శారదా నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన బార్‌ను మూసివేసిన తర్వాత రూ.2కోట్లు తీసుకుని వెళ్తుండగా సిగ్నల్ వద్ద ఇద్దరు వచ్చి తన వద్ద ఉన్న డబ్బులను దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, వెంకట్‌రెడ్డి తాను రూ.50లక్షలు తీసుకుని బయలుదేరానని, డబ్బులు దోచుకునే సమయంలో రూ.25లక్షలు కిందపడగా, 25లక్షల రూపాయలు దోచుకుని వెళ్లారని చెప్పాడు.
అంతేకాకుండా డబ్బుల గురించి వెంకట్‌రెడ్డి వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. పూర్తి వివరాలు చెప్పకుండా దాస్తున్నాడని అనుమానించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. సిసి కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా ఎలాంటి దోపిడి జరగనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంకట్ రెడ్డిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా కేవలం ప్రవీణ్‌కు డబ్బులు ఎగ్గొట్టేందుకు వెంకట్‌రెడ్డి దోపిడి డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు వెంకట్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.2.75కోట్ల హవాలా డబ్బులు దొరికాయి.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ హవాలా డబ్బులు పంపిస్తుండగా పాతబస్తికి చెందిన ఫారూఖ్, వెంకట్‌రెడ్డి కలిసి ఇక్కడ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకు ముగ్గురు కలిసి ఆరు నెలల్లో రూ.28 కోట్ల హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసింది. హవాలా లావాదేవిలకు సంబంధించిన వివరాలను వెంకట్‌రెడ్డి డైరీలో రాసుకోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని వెంకట్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇదే కేసులో ఉన్న పాతబస్తీ, రియాసత్‌నగర్‌కు చెందిన ఫారుఖ్ పరారీలో ఉండగా అతడి ఇంటిలో రాచకొండ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హవాలా డబ్బుల గురించి రాచకొండ పోలీసులు ఐటి అధికారులకు సమాచారం ఇచ్చారు.
పలువురితో వ్యవహారాలు…
వెంకట్‌రెడ్డి, ఫారుఖ్ కలిసి హవాలా డబ్బులను నగరంలోని వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఇచ్చినట్లు తెలిసింది. అవసరం ఉన్న వారి తరఫున హవాలా నిర్వహించినట్లు తెలిసింది. ప్రవీణ్, వెంకట్‌రెడ్డి, ఫారూఖ్ కలిసి హవాలా వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. తనిఖీల విషయం తెలియడంతో ఫారూఖ్ పరారయ్యాడు.