Sunday, January 12, 2025

వివిఐపిలకు గద్దలతో భద్రత

- Advertisement -
- Advertisement -

జనవరి నుంచే రంగంలోకి ఈగల్ స్కాడ్..!?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి, ప్రధాని, సిఎం వంటి వివిఐపిలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పిస్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనం. అయినా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో గగనతలం నుంచీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందుకోసం తెలంగాణ పోలీసులు గరుడ దళం (ఈగల్ స్కాడ్)ను రంగంలోకి దింపను న్నారు. ఈ మేరకు ఇప్పటికే 4 గద్దలకు మెయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైఇంగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణనిచ్చారు. అనుమానాస్ప ద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదునిచ్చారు.

ఇటీవలే ఈ గరుడ దళం సిఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద డెమోను సైతం ఇచ్చింది. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అంతర్గత భద్రత విభాగంలో భాగంగా ఉంటూ తెలంగాణలో వివిఐపి రక్షణను పర్యవేక్షించనుంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసు శాఖలో గరుడ దళాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. చిన్న పక్షి పిల్లలను తెచ్చి, వాటిని పోషిస్తూ , తర్ఫీదు ఇస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.

వారితో పాటు కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌తో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానా స్పద వ్యక్తులను గమనించడం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో వీటికి అమర్చిన ప్రత్యేక నిఘా కెమెరాల సాయంతో భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతారు. సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టవచ్చు. కానీ డ్రోన్ల నుంచి వెలువడే శబ్దం, వాటి కదలికలను కింద ఉన్నవారు సులువుగా గుర్తించవచ్చు. దీనితో నేరస్తులు అప్రమత్తమై తప్పించుకోవడం, లేదా తాము చేసేది గమనించలేకుండా చేయడం వంటివాటికి పాల్పడే చాన్స్ ఉంటుంది. అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే విఐపిల భద్రతతో పాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలికలను పసిగట్టేందుకు కూడా ఈ గరుడ స్కాడ్‌ను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగా డ్రోన్లను ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశముండదు. వాటి వేగమూతక్కువ. అదే ‘గరుడ స్కాడ్’తో ఈ సమస్యలు ఉండవని అంటున్నారు.

జనవరి నుంచే రంగంలోకి…!

కాగా, ద్రోన్లు వాతావరణంలో మార్పుల వల్ల నూరు శాతం సమర్ధవంతంగా పనిచేయటంలేదు. అందుకనే ప్రత్యేకంగా ఈగల్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపబోతున్నారు. గద్దలకు వాతావరణంలో మార్పులతో ఎలాంటి సమస్యలుండవు. 365 రోజులు, 24 గంటలూ ఆకాశంలో ఈగల్ స్క్వాడ్ ఎప్పుడైనా సేవలు అందించటానికి సిద్ధంగా తయారు చేశారు. జనవరి నుంచే ఈగల్ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈగల్ స్వ్కాడ్ సేవలు ఉపయోగించోకోబోతున్న రాష్ట్రం తెలంగాణ కాగా, ఇప్పటికి ఈగల్ స్క్వాడ్ సేవలు నెదర్‌ల్యాండ్స్ పోలీసుల దగ్గర మాత్రమే అందుబాటులో ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News