హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వద్ద రక్తం మడుగులో మృతదేహం పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హయత్ నగర్ లోని ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా పోలీసులు గుర్తించారు. నగేష్ ను హత్య చేసి మృదేహాన్ని పడేశారా? లేదా అక్కడే హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తలకు, చేతులకు, కాళ్లకు కత్తి గాయాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు.
నగేష్ భార్య శిరీష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త నగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నగేష్ ను రాత్రి జామీను మీద బంధువులు బయటికి తీసుకొచ్చారు. శిరీష ఆత్మహత్యతో భర్త నగేష్ పై మృతురాలు బంధువులు దాడి చేయడంతో చనిపోయాడా? లేక భార్య ఆత్మహత్యతో నగేష్ ఆత్మహత్యా చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శరీరంపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనే అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.