కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కోల్‌కతా హైకోర్టు జడ్జి కౌశిక్ చందా రూ.5 లక్షల జరిమానా విధించారు. నంది గ్రామ్ నియోజక వర్గం నుంచి బిజెపి ఎమ్‌ఎల్‌ఎ సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతాబెనర్జీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జడ్జి కౌశల్ తప్పుకోవాలని మమతాబెనర్జీ కోరారు. దీంతో ఆ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు విచారణ నుంచి జడ్జి కౌశల్ తప్పుకున్నారు. అయితే న్యాయవ్యవస్థనీ, న్యాయమూర్తిని కించపరిచినందుకు మమతా బెనర్జీకి రూ. 5 లక్షలు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. నందిగ్రామ్ ఎన్నిక ఫలితం ప్రకటనలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సువేందు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే బిజెపి నేపథ్యం ఉన్న జస్టిస్ కౌశిక్ చందా పిటిషన్ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చాలని మమత గత నెల హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యదర్శికి లేఖ రాశారు. మమత అభ్యర్థనపై కౌశిక్ స్పందించారు. తాను ఆ కేసు విచారణ నుంచి తప్పుకున్నానని వివరిస్తూ వేరే ధర్మాసనానికి ఈ పిటిషన్‌ను బదిలీ చేయాలని హై కోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్‌కు పిటిషన్‌ను పంపారు. అయితే ఈ కేసు విచారణను విడిచి పెట్టే ముందు ఆయన మమతాబెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జికి కళంకం తెచ్చే విధం గా సిఎం మమతాబెనర్జీ ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నట్టు ఆయన ఆరోపించారు.
బిజెపి లీగల్ సెల్‌కు తానెప్పుడూ కన్వీనర్‌గా లేనని, కానీ కోల్‌కతా హైకోర్టుకు రాకముందు ఆ పార్టీ తరఫున కొన్ని కేసులు వాదించానని పేర్కొన్నారు. పిటిషనర్ మమతాబెనర్జీ కేసులో విచారణ జరపాలని ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం కానీ, ఆసక్తి కానీ తనకు లేదని తెలిపారు. చీఫ్ జస్టిస్ తనకు అప్పగించిన పిటిషన్‌పై విచారణ జరపడం తన రాజ్యాంగ విధిగా ఆయన చెప్పారు. అయితే జూన్ 18న తాను విచారణ చేపట్టిన తరువాత టిఎంసి నేతలు తన ఫోటోలను, ట్విటర్‌లో పోస్ట్ చేశారని, ఇది పూర్తిగా న్యాయమూర్తిని అవమానించడానికి ముందుగా వేసుకున్న ప్రణాళికగా ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. కోల్‌కతా హైకోర్టు బెంచ్‌కు రాకముందు బిజెపి ప్రభుత్వానికి జస్టిస్ కౌశిక్ చందా అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఆయన ను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడం పై మమతాబెనర్జీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
HC judge imposes Rs 5 lakh fine on Mamata