వివాదాస్పద 32,000 ఫిగర్ టీజర్ తొలగించనున్న నిర్మాత
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి) సినిమాను పరిశీలించి, ప్రదర్శనకు అనువుగా ఉందని గుర్తించిందన్న కోర్టు.
తిరువనంతపురం: వివాదాస్పద బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ట్రయిలర్‌లో ఏ సముదాయాన్ని కించపరిచేలా ఏదీ లేదని అభిప్రాయపడింది. కేరళకు చెందిన 32000 మంది మహిళలు మతం మారి తీవ్రవాద సంస్థలో చేరారనే ప్రకటనతో కూడిన ఆక్షేపణీయమైన టీజర్‌ని అలాగే ఉంచాలని తాము భావించడం లేదని నిర్మాతలు విన్నవించుకోవడాన్ని న్యాయమూర్తులు ఎన్.నగరేశ్, సోఫీ థామస్‌తో కూడిని ధర్మాసనం పరిశీలించింది.
సినిమాను చూసి ఉత్తర్వును జారీ చేసిన న్యాయమూర్తి నగరేశ్ ‘ఓ ప్రత్యేక సముదాయానికి విరుద్ధంగా ట్రయిలర్‌లో మాకేమీ ఆక్షేపణీయ అంశాలు కనిపించలేదు’ అన్నారు. ప్రజాప్రదర్శనకు ఆ సినిమా అనుగుణంగానే ఉన్నట్లు సిబిఎఫ్‌సి పేర్కొందని ఆయన తెలిపారు.సినిమా ఓ కాల్పనికం, నాటకీయం అని, చారిత్రక ఘటనలతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతలు ఓ డిస్‌క్లెయిమర్‌ను ప్రచురించారని కూడా కేరళ హైకోర్టు గమనించింది.
ఈ సినిమాపై దాఖలైన పిటిషన్లు వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారని, తద్వారా కేరళ ప్రజలను అవమానించారని, అందుకే ఆ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. కేరళ నుంచి తప్పిపోయిన 32000 మంది మహిళలను గురించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన పాత్రలో నటి అదా శర్మ నటించారు. ఈ సినిమా శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలవుతోంది.
కేరళకు చెందిన 32000 మంది మహిళలను మతం మార్చి, ర్యాడికలైజ్ చేశారని, వారిని భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని సినిమాలో చూపడాన్ని కేరళలోని సిపిఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు తప్పుపట్టాయి.