మన తెలంగాణ/హైదరాబాద్: వివాదాల పుట్టగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)లో ఆదివారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిగే వరకు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్న ట్లు అంబుడ్స్‌మన్ తెలిపింది. కాగా హెచ్‌సిఎలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ హెచ్‌సిఎ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజరుద్దీన్ ఇటీవల అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అజర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ తీవ్రంగా స్పందిస్తూ అసలు అబుడ్స్‌మన్ నియామకం చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజర్ ఏకపక్షంగా నియమించాడని, ఆ వ్యక్తి అజర్ చెప్పినట్లే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.