హెచ్‌సియూలో ఆత్మహత్య చేసుకున్న మౌనిక తండ్రి లచ్చయ్య
హైదరాబాద్: తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హెచ్‌సియూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మౌనిక తండ్రి లచ్చయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండలం, తారుపల్లి గ్రామానికి చెందిన రఘశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్. మౌనిక(27) హైదరాబాద్ సెట్రల్ యూనివర్సిటీలో ఎం. టెక్ నానో సైన్స్ రెండో ఏడాది చదువుతోంది. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనిక బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ చేసింది. అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‌సియూలో ఎంటెక్ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించడంతో ఈ నెల 18వ తేదీన మౌనిక హాస్టల్ గదిలోకి వచ్చి ఉంటోంది.
ఈ క్రమంలోనే సోమవారం హాస్టల్‌లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి గదిలో నుంచి బయటికి రాకపోవడంతో స్నేహితులు బయటికి రావాలని పిలిచారు. అయినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందివ్వడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. తన కూతురు అందరితో చాలా కలివిడిగా ఉండేదని, ధైర్యంగా ఉండే స్వభావం మౌనికదని తండ్రి లచ్చయ్య తెలిపారు. యూనివర్సిటీ నిర్లక్షం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.