Wednesday, January 29, 2025

ప్రస్తుత కాంగ్రెస్ ఒరిజినల్ కాదు..నకిలీ

- Advertisement -
- Advertisement -

దేశంలో నేడున్న కాంగ్రెస్ పార్టీ అసలైనది కాదని, ప్రస్తుతం ఉన్న గాంధీలు బూటకపు గాంధీలని, వారు మహాత్మా గాంధీ పేరిట రాజకీయాలు చేస్తున్నారని జెడి(ఎస్) నాయకుడు, కేంద్ర మంత్రి హెచ్‌డి. కుమారస్వామి గురువారం విమర్శించారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీని కొనసాగించొద్దని నాడే అన్నారని, ఆ పార్టీ ‘అలీబాబా 40 దొంగలు’ వంటిదని, కర్నాటకలోని కాంగ్రెస్ పార్టీని లక్షం చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. ‘గాంధీ శత వార్షికోత్సవం పేరిట కాంగ్రెస్ నాయకులు బెలగావి(బెల్గాం)లో పోగయ్యారు. 1924లో ఇక్కడ నిర్వహించిన సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది.

గాంధీ పేరిట బూటకపు గాంధీలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా మహాత్మా గాంధీ కటౌట్ చూడలేదు. ఇప్పటి గాంధీల కటౌట్లే నాకు ఎక్కడ చూసినా కనిపించాయి’ అని కుమారస్వామి విలేకరులతో అన్నారు. గాంధీ పేరిట నిర్వహించే కార్యక్రమానికి తాను వ్యతిరేకిని కానని కూడా ఆయన కితాబునిచ్చుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చాలానే చేశారు అన్నారు. కానీ నేటి గాంధీలేమి చేశారని కూడా ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా వారు, వారి కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి? అని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి పదేపదే చెబుతోంది, కానీ వాస్తవాలేమిటన్నది వెల్లడించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News