Sunday, November 3, 2024

16 శాతం పెరిగిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభాలు

- Advertisement -
- Advertisement -
HDFC Bank Q1 FY22 Results
జూన్ త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం

ముంబయి: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జూన్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే ఇది 16.1 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం రూ.6,658.6 కోట్లుగా ఉంది. అయితే బ్యాంక్ ఆస్తుల నాణ్యత దిగజారడం, కేటాయింపులు పెరగడంతో అది మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాంక్ నికర లాభం ఈ త్రైమాసికంలో రూ.7,931 కోట్లు నికర వడ్డీ ఆదాయం రూ.17,634 కోట్లు ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. అయితే ఈ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ రాబడి 8.57 శాతం పెరిగి రూ.17,009 కోట్లకు చేరింది. బ్యాంక్ ఇచ్చిన రుణాలు 14.4 శాతం పెరగడం, వడ్డీ ఆదాయం మార్జిన్ 4.1 శాతానికి పెరగడమే దీనికి కారణం.

ఇదే సమయంలో బ్యాంక్ ఇతర ఆదాయం 54.3 శాతం పెరిగి రూ.6,228.5 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే త్రైమాసికంలో బ్యాంక్ నికర రాబడి 18 శాతం పెరిగి 23,297.5 కోట్లకు చేరింది. గత ఏడాది ఈ మొత్తం రూ.19,740.7 కోట్లుగా ఉంది. కాగా క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇప్పుడు బ్యాంక్ కేటాయింపులు, కంటింజెన్సీలు 24 శాతం పెరిగి రూ.4,830.8 కోట్లకు చేరాయి. ఇందులో ఒక్క రుణాల నష్టాల కేటాయింపులే రూ.4,219.7 ఉన్నాయి. క్రితం త్రైమాసికంలో ఈ మొత్తం రూ.4,693.7 కోట్లుగా ఉంది. ‘ ఈ త్రైమాసికంలో నాలుగింట మూడువంతులు కరోనా సెకండ్ వేవ్ బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలిగించిందని, ఫలితంగా వసూళ్ల సామర్థం తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. ఈ కారణంగా కేటాయింపులు పెరిగాయని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు 1.32 శాతం ఉండగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అవి 1.47 శాతానికి పెరిగాయి. శనివారం స్టాక్ మార్కెట్ల రెగ్యులేటర్ సెమికి సమర్పించిన నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు తెలిపింది.

HDFC Bank Q1 FY22 Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News