Tuesday, February 25, 2025

కాటం.. పోరాటపటిమకు నిలువుటద్దం

- Advertisement -
- Advertisement -

ఆయన నిజాం వ్యతిరేక పోరాట యోధులలో ప్రముఖుడు. స్వార్థం అనే పదాన్ని దగ్గరకు రానీయకుండా, రాజకీయ పదవులకు ఏనాడూ పాకులాడకుండా కేవలం ప్రజలకు, విలువలకోసం ఎంతటి వారినైనా ఎదిరించి ధైర్యంగా, నిర్మొహమాటంగా నిలబడటం ఆయనకే చెల్లింది. సంస్థానాలలో స్వాతంత్య్ర యోధులను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడాన్ని అవమానంగా భావించి పోరాడి సంస్థానాల లోని స్వాతంత్య్ర యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించేలా చేసిన ఘనత ఆయనదే. హైదరాబాదు స్వాతంత్య్ర సమర చరిత్రను ప్రామాణిక పద్ధతుల్లో గ్రంథస్థం చేయించిన కృషీవలుడు.

1968లో హైకోర్టు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇవ్వగా దాంతో బలహీన వర్గాల నాయకులందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దానికి కన్వీనరు అయి సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పును రద్దు చేయించారు. ఆ సందర్భంలో ఒక మహాసభ ఏర్పాటు చేయించారు. దానికి లక్షలాది మంది రాగా నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంది కూడా రావడం విశేషం. లక్ష్మీ నారాయణ సాధించిన ఘన విజయాలలో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమి లాగా హిందీ అకాడమి ఉండాలని ఉద్యమించి ప్రభుత్వాన్ని ఒప్పించి, స్థాపించి దానికి తానే ఉపాధ్యక్షులయ్యారు.

కాటం లక్ష్మీనారాయణ (సెప్టెంబరు 19, 1924 ఫిబ్రవరి 25, 2010) రంగారెడ్డి జిల్లా శంషాబాదులో లక్ష్మయ్య, సత్తెమ్మలకు 1924వ సంవత్సరంలో సెప్టెంబరు 19న జన్మించారు. ఆయన తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన ధైర్యవంతులు. తాత పేరుతో పాటు ధైర్య సాహసాలు కూడా పుణికి తెచ్చుకున్నారు. 1942 అక్టోబరు 12న బూర్గుల రామకృష్ణారావు చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు చేసిన సందర్భంలో నైజాం పోలీసులు బూర్గుల రామకృష్ణారావును, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు.

అప్పటికి నారాయణ వయసు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మీనారాయణ బూర్గుల రామకృష్ణారావుని గురువుగా భావించారు. పోలీసులు లక్ష్మీనారాయణను ఏడు నెలలపాటు చెంచల్‌గూడ జైల్లో వుంచారు. తర్వాత లక్ష్మీనారాయణ న్యాయ విద్య పూర్తిచేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్‌గా చేరారు. బూర్గులతో పాటు అన్ని కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాటి సామాజిక సమస్యలలో కూడా పాలు పంచుకున్నారు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను ధిక్కరించి హిందీ పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్ధరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.

ఆచార్య రంగా ప్రేరణతో 1945లో లక్ష్మీనారాయణ హైదరాబాదు యువజన కాంగ్రెసు స్థాపించి తాను ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నిజాం పాలన అంతమై, నూతన రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాష్ట్ర పునర్నిర్మాణానికి 1949 డిసెంబరులో ‘జనత’ పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. గతంలో రజాకార్ల చేతిలో హతుడైన షోయబుల్లా ఖాన్‌తో కలిసి పత్రికా రంగం లో పని చేసిన అనుభవం ఆయనది. అంతేగాక రైతుల సమస్యల పరిష్కారానికి 1952లో రాష్ట్ర కర్షక సంఘాన్ని స్థాపించారు. ‘తెలుగు భూమి’ అనే మరో పత్రికను 1969లో ప్రారంభించారు. స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది అని నమ్మేవారు లక్ష్మీనారాయణ.

స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటున్నా నిజాం పాలిత ప్రాంతాల యోధులకు ఆ అవకాశం రాలేదు. దీనిపై లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం అంగీకరిం చక పోవడంతో లక్ష్మీనారాయణ ‘తెలంగాణ సమర యోధుని సత్యా గ్రహం’ అని రాసిన ఒక అట్టను మెడలో వేసుకుని ప్రధాని ఇంటి ముందు నిరాహార దీక్ష చేశారు. ఢిల్లీ పత్రికలు ప్రముఖంగా ఈ అంశాన్ని ప్రచురించాయి. దాంతో ఇందిరా గాంధీ లక్ష్మీనారాయణను పిలిపించి కారణం అడగగా ‘సంస్థానాలలో స్వాతంత్య్ర యోధులను మీరు గుర్తించకపోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాం.

బ్రిటిష్ ఆంధ్ర స్వాతంత్య్ర యోధులు బ్రిటిష్ వారితోనే పోరాడారు. కాని సంస్థానలోని యోధులు అటు సంస్థానాధీశులతోను, ఇటు బ్రిటిష్ వారితోను పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్య్ర దినం కాదా? హైదరాబాద్ విముక్తి జరిగిన సెప్టెంబరు 17ను స్వాతంత్య్ర దినంగా జరుపుకోమంటారా? ఒక్క హైదరాబాద్ సంస్థాన ప్రజలే కాదు పలు సంస్థానాల ప్రజలు భారతీయులు కారా? అవునా? ముందు ఇది తేల్చండి?’ అని సూటిగా, ధైర్యంగా ఇందిరా గాంధీని ప్రశ్నించి యోధుడు లక్ష్మీ నారాయణ. దాంతో సంస్థానాలలోని స్వాతంత్య్ర యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది.

నేటికీ ప్రామాణిక గ్రంథంగా ఉన్న 844 పేజీల హైదరాబాద్ స్వాతంత్య్ర సమర చరిత్రను ప్రామాణిక పద్ధతుల్లో గ్రంథస్థం చేయించారు. దాన్ని అప్పటి భారత రాష్ట్రపతి జైల్‌సింగ్ చేత ఆవిష్కరింపజేశారు. పివి నరసింహా రావు, టి. అంజయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రామ రెడ్డి నలుగురు ముఖ్యమంత్రులతో ఒక సభను నిర్వహించారు. అయన నిర్వహించిన సభలకు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర సమరయోధులు, దలైలామ వంటి వారు కూడా పాల్గొనేవారు. ఆ మహాయోధుడు 2010వ సంవత్సరం ఫిబ్రవరి 25 నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News