బాధితుల నుంచి రూ. 1.68 కోట్లు వసూలు చేసిన నిందితుడు
టిఎస్‌ఎస్‌పిలో హెడ్ కానిస్టేబుల్
అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన హెడ్ కానిస్టేబుల్‌ను నార్సింగి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మూడు లారీలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి ఎస్సై బాలరాం కథనం ప్రకారం…ఎపిలోని కర్నూలు జిల్లా, ఓక్ మండలం, ఉప్పలపాడు గ్రామానికి చెందిన బోయ షేక్‌షావలి టిఎస్‌ఎస్‌పిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డిజిల్లా, గండిపేట మండలం, హైదర్‌షాకోట్‌లోని హిమగిరినగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో 2019 నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టాడు. నిందితుడు గతంలో ఎపి, తెలంగాణ సిఎంల వద్ద పనిచేయడంతో దానిని ఉపయోగించుకుని మోసాలు చేస్తున్నాడు. ఎపి, తెలంగాణలో తనకు ముఖ్యమంత్రులు తెలుసని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు అమాయకుల వద్ద నుంచి రూ.1,60,00,000 వసూలు చేశాడు. ఈ క్రమంలోనే దేవదుర్గం నర్సింహ ఉద్యోగం వెతుకుతున్నాడు.
తన మామయ్యకు స్నేహితుడు కావడంతో పరిచయం ఏర్పడింది. దీంతో ఎపి జెన్‌కోలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు పలుమార్లు రూ.10,00,000 ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దూరపు బంధువు నిజామాబాద్ జిల్లాకు చెందిన కొర్రెకొండ సంతోష్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.8లక్షలు తీసుకున్నాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు ఇలా చాలామంది అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ప్లాట్లు, మూడు లారీలు కొనుగోలు చేశాడు. ఇంటెలీజెన్స్‌లో అడిషనల్ ఎస్పిగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడి కార్డును తయారు చేయించుకున్నాడు. ఎస్సై బలరాం, ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివప్రసాద్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.