సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని అలకనంద ఆసుపత్రిలో దర్జాగా సాగుతున్న
కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సలు యూరాలజిస్ట్ లేకుండానే ఆపరేషన్లు
డిఎంహెచ్‌ఒ దాడిలో బయటపడ్డ దారుణాలు ఆసుపత్రి సీజు
మనతెలంగాణ/ఎల్‌బినగర్: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేసిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సరూర్‌నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో 9 పడక ల అలకనంద మల్టీ ఆసుపత్రి పేరు మీద అనుమతి తీసుకుని నడిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు , ఎల్బీనగర్ ఏ సీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి, డీప్యూటీ డిఎంహెచ్‌ఓ గీతా, సరూర్‌నగర్ ఆసుపత్రి వైద్యురాలు అర్చనలు కలసి ఆసుపత్రిపై దాడి చేసి సీజ్ చేశారు. డిఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ కిడ్నీలు మార్పిడి జరుగుతుందన్న సమాచారంతో ఆసుపత్రిపై పోలీసులు సహకారంతో దాడి చేశామని తెలిపారు. ఆసుపత్రిలో యురాలజిస్ట్ లేకుండా ఆసుపత్రిలో కి డ్నీ లు మార్పిడి చేస్తున్నారని,ఆసుపత్రిలో ప్లాస్టిక్ స ర్జన్ వైద్యుడు, ఫిజిషయన్ మాత్రమే ఉన్నారని, కజకిస్థాన్‌లో
చదివిన ఓ వైద్యుడు పేరు మీద ఆసుపత్రి అనుమతి తీసుకున్నారని తెలిపారు. ఆసుపత్రిలో సుమంత్ అనే వ్యక్తి ఉన్నాడని అతని విచారణ చేపట్టగా నాకు ఏమి తెలియదని తెలిపారని పేర్కొన్నారు. ఇద్దరు కర్ణాటక, ఇద్దరు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు ఆసుపత్రిలో కిడ్నీలు మార్పిడి చేసుకున్నారని, ఇద్దరి దగ్గర కిడ్నీ తీసుకుని ఇద్దరికి అమర్చినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. వైద్యులు ఇక్కడి నుంచి పరారయారని, వెంటనే ఆసుపత్రిని సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం.
మంత్రి రాజనర్సింహ ఆరా
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డాక్టర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద హాస్పిటల్‌లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం, ఇతర వ్యక్తులను ఉపేక్షించొద్దని, చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో తనిఖీలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు కోసం ఆరోగ్యశాఖ అధికారులతో ఇదివరకే టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలు మరింత పకడ్బంధీగా పనిచేయాలని, ఇలాంటి వ్యవహారాలను నిరోధించేలా కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.హాస్పిటల్స్‌లో జరిగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. అలకనంద హాస్పిటల్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.