పెద్దపల్లి : వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో గురుకుల పాఠశాలలోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర మైనారిటీ ప్రభుత్వ సలహాదారు, మైనారిటీ గురుకుల అధ్యక్షులు ఏకే ఖాన్ అన్నారు. శుక్రవారం రంగంపల్లిలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఏకే ఖాన్ పరిశీలించారు. మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో తరగతి గదులు, డార్మేటరీ, భోజన గది, వంటశాల, స్టోర్ రూం, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. విద్యార్ధినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరమైన ఆహారం ఎప్పటికప్పుడు అందించాలని నిల్వ ఉంచిన ఆహారం అందించవద్దని, విద్యార్థులకు ఆహారంలో వినియోగించే కూరగాయలు, ఇతర పదార్థాలు నాణ్యతగా, పరిశుభ్రంగా ఉండాలని ఆయన తెలిపారు.
విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి పాఠశాలలో అందిస్తున్న విద్యాబోధన , భోజన వసతి, ఇతర సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొని సంతృప్తి చెందారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను వినియోగించుకోవాలని , ఉపాధ్యాయులు నేర్పించే అంశాలను శ్రద్ధగా విని మంచి విద్యా బుద్దులు నేర్చుకొవాలని ఆయన సూచించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యా బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాతావరణంలో మార్పు వచ్చిందని, భారీ వర్షాల నేపథ్యంలో గురుకుల పాఠశాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి విద్యార్థిని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్, విజిలెన్స్ అధికారులు అక్రమ్ పాషా, షౌకత్ అలీ, ప్రిన్సిపాల్ లు భాగ్యలక్ష్మి, అస్మా జబిన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.