ములుగు: హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు. ఈరోజు ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రారంభం సందర్భంగా ఇ- హెల్త్ కార్డులను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపి మలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిహెచ్ శ్రీనివాస్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రమే ఈ విధానం ఉందని, ములుగు జిల్లా రికార్డు సొంతం చేసుకుందని ప్రశంసించారు. ఇందులో పాలుపంచుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో మనం హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ను ములుగు, సిరిసిల్లలో ప్రారంభించుకున్నామన్నారు. రెండు జిల్లాల్లో 40 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్తారని, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తామని, అక్కడికక్కడే వారికి ఒక హెల్త్ ఐడీని క్రియేట్ చేస్తారని, ఆరోగ్య సమాచారాన్ని అందులో అప్ లోడ్ చేస్తారన్నారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హెల్త్ ప్రొఫైల్ పేరుతో మొబైల్ యాప్‌ను తయారు చేసిందన్నారు.
హెల్త్ ప్రొఫైల్ లో కూడా ఒక వ్యక్తి సమస్త ఆరోగ్య సమాచారాన్ని పొందు పరుస్తామని, ఎప్పుడు పుట్టారు, ఎత్తు, బరువు, శరీర కొలతలు, గుండె కొట్టుకునే తీరు, రక్త వర్గం, జ్వరం, బిపి, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నాయా? ఉంటే ఎలాంటి ఏ చికిత్స తీసుకుంటున్నారు? వంటి వివరాలన్నీ అందులో పొందుపరుస్తామన్నారు.
ఆరోగ్య వివరాలను సేకరించిన తర్వాత సర్వే చేసిన వ్యక్తులకు హీమోగ్లోబిన్, ఆర్బీఎస్ టెస్టులు నిర్వహిస్తామని, రక్త, మూత్ర నమూనాలను సేకరించి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పంపి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాలను ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపిస్తామన్నారు. 18 ఏళ్లకు పైబడినవారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3.80 లక్షల మంది, ములుగు జిల్లాలో 2.60 లక్షల మంది ఉన్నారని, రెండు జిల్లాలకు కలిపి మొత్తం 420 పైగా బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో ఒక ఎఎన్ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలు ఉన్నారన్నారు.
ఒక్కో బృందం ఒక రోజుకు కనీసం 40 మందికి పరీక్షలు చేస్తారని, ఇలా 40 రోజుల్లో రెండు జిల్లాల్లో సర్వే పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం రెండు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ప్రాథమికంగా రూ.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని హరీష్ రావు వివరించారు.
శాంపిళ్లను పరీక్షించేందుకు సిరిసిల్ల జిల్లాలో రూ.6.20 కోట్లు, రూ.9.03 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందని, ఈ హెల్త్ ప్రొఫైల్ తో అనేక లాభాలు ఉన్నాయని, ఎక్కడ వైద్యం కోసం వెళ్లినా రిపోర్టులు, డాక్యుమెంట్లు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ ఈ హెల్త్ ప్రొఫైల్ ను చూస్తే చాలు అని, ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారం మొత్తం డాక్టర్ కు తెలిసిపోతుందన్నారు.
ఒక వ్యక్తికి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే డాక్టర్లు ప్రత్యేకంగా అతడికి పరీక్షలు నిర్వహించాల్సిన పనిలేదని, హెల్త్ ప్రొఫైల్ ను ఓపెన్ చేస్తే చాలు అని, అతడికి ఎలాంటి చికిత్స అందించాలో అర్థమవుతుందన్నారు. తెలంగాణలోని రైతు బంధు, రైతు భీమా, 24 గంటల కరెంట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. హెల్త్ ప్రొఫైల్ కూడా ఆదర్శం కానుందని హరీష్ రావు పేర్కొన్నారు.
ములుగు జిల్లా అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ అందుకే ఇక్కడ ప్రారంబించామని, గ్రామ పంచాయతీనీ జిల్లా కేంద్రంగా చేయడం ఎక్కడా జరగలేదని ఇక్కడే జరిగిందన్నారు. గిరిజన యూనివర్సిటీ అడిగితే కేంద్రం దారుణంగా మోసం చేసిందని, కేవలం 40 కోట్లు ఇచ్చిందని, అది కూడా ఎపి తెలంగాణకు కలిపి ఇచ్చిందని దుయ్యబట్టారు.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ గిరిజన యూనివర్సిటీ లో గిరిజనులకు 7.5 శాతం సీట్లు ఇస్తారట, పేరుకే గిరిజన యూనివర్సిటీ. ఇచ్చేది ఏడున్నర శాతం అని, ఇదెక్కడి న్యాయమన్నారు. నాడు ఒక్క గిరిజన మహిళా రెసిడెన్షియల్ కాలేజీ లేకుంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ ములుగులో ఏర్పాటు చేశారని, రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చామని, దేశంలోనే మొదటి సారి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజీ మనం రాష్ట్రంలో ప్రారంభించామని, అన్నింట్లో 90 శాతం గిరిజనులకు ఇస్తున్నామని, తాము 90 శాతం సీట్లు ఎస్టీలకు ఇస్తున్నామని, మీరు ఏడున్నర శాతం ఇవ్వడం ఏంటని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.