Sunday, January 5, 2025

ఉద్యోగులకు ఆరోగ్యరక్ష

- Advertisement -
- Advertisement -

దసరా ముంగిట సిఎం కెసిఆర్ తీపి కబురు

ప్రభుత్వ సిబ్బంది, కుటుంబసభ్యులు పెన్షనర్ల కోసం హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పాటు
నిర్వహణకు సిఎస్ నేతృత్వంలో బోర్డు
కంట్రిబ్యూషన్ కింద ట్రస్టుకు ప్రతి నెలా నిర్దేశిత మొత్తం ఉద్యోగి ఖాతా నుంచి జమ

ప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంట్

జిఒ నెం.186 విడుదల
మంత్రి హరీశ్, సంఘాల హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సిఎం కెసిఆర్ తీపికబురు అందించారు. దసరాకు ముందే వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత, మరింత నాణ్యమైన చికిత్స అందించేందుకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్  (ఈ.హెచ్.సి.టి) ఏర్పాటుచేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదట పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. పథకం అ మలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం ఈహెచ్‌ఎస్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఈహెచ్‌ఎస్ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈహెచ్‌ఎస్ సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్‌గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల జమ చేస్తుంది. ఈహెచ్‌ఎస్ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 15 పోస్టులను మంజూరు చేసింది.-పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ప్రత్యేకంగా విడుదల చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News