Monday, December 23, 2024

స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం

- Advertisement -
- Advertisement -
9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం
తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర
వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు

హైదరాబాద్ : తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతో బలోపేతం చేశారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం.. తొమ్మిదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా ఎదిగింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. స్వరాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయి. 2015 -16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. 2023 -24 నాటికి రూ.12,364 కోట్లకు పెరిగింది. తొమ్మిదేండ్లలో హెల్త్ బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి కేటాయింపులు రూ.925 మాత్రమే ఉండగా, తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తలసరి కేటాయింపులు రూ.3,225గా నమోదైంది.

గణనీయంగా పెరిగిన మెడిసిన్ సీట్లు
60 ఏండ్ల ఉమ్మడి పాలకులు కేవలం 3 మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేయగా, తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో కొత్తగా 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి రికార్డు సృషించారు. దీంతో పేదలకు మెరుగైన వైద్యం అందకపోగా, రాష్ట్ర విద్యార్థులు వైద్యవిద్య చదివేందుకు ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. గడిచిన నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా నిలిపారు. రాష్ట్రంలో మొత్తం 2014లో 2,950 ఎంబిబిఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,340 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. తద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ప్రతి లక్ష జనాభాకు 7.5 పిజి సీట్లతో రెండో స్థానంలో నిలిలువగా,త్వరలో మొదటి స్థానానికి చేరనున్నది. ఎంబిబిఎస్ సీట్ల పెరుగుదల దేశంలో 71 శాతంగా ఉంటే, తెలంగాణలో 124 శాతంగా ఉన్నది. పిజి సీట్ల పెరుగుదల జాతీయ సగటు 68 శాతం ఉంటే, తెలంగాణ 111 శాతం నమోదు చేసింది. గతేడాది నుంచి బి కేటగిరీలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ర్రాష్టంలోని 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,071 ఎంబిబిఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించాయి. ఫలితంగా 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చింది. ఎస్‌టి రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఎంతో మంది ఎస్‌టి విద్యార్థులకు లబ్ధి చేకూరింది.

70 శాతానికి పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు
మాతాశిశు సంరక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ పథకం సూపర్ హిట్‌గా నిలిచింది. ఎఎన్‌సి చెకప్స్‌లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలవగా, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 2014తో పోల్చితే రెట్టింపు అయ్యాయి. నాడు 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు గత ఏప్రిల్ నాటికి 70 శాతానికి చేరుకున్నాయి. వంద శాతం పిల్లలకు టీకాలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. ఫలితంగా రాష్ట్రంలో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. 2014 నాటికి 92గా ఉన్న మాతృమరణాల రేటు ఇప్పుడు 43కు తగ్గింది. శిశుమరణాల రేటు 39 నుంచి 21కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హెచ్‌ఐఎంఎస్ నివేదిక ప్రకారం దేశంలో వందశాతం సురక్షిత ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. జాతీయ సగటు 89గా ఉంటే.. తెలంగాణ ఎంతో మెరుగైన స్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కెసిఆర్ న్య్రూటిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 9 జిల్లాల్లో పంపిణీ చేయగా, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా మొత్తం 6.84 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించారు. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు క్రమంగా పెరుగుతున్నాయి. మొదట హైదరాబాద్‌లో ప్రారంభమై, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో క్రమంగా ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 400 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. మిగతావి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రోగాలను ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించేందుకు వీలుగా ర్రాష్టంలో ఎన్‌సిడి స్క్రీనింగ్ కార్య్రకమం నిర్వహిస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనితీరును మెరుగుపరిచేందుకు 887 పిహెచ్‌సిల్లో లైవ్ సిసిటివి కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్య మహిళ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 102 కు పెంచారు.

నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 2021లో ‘హెల్త్ ఇండెక్స్’లో ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, ఆసుపత్రి ప్రసవాల పురోగతిలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలువడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమమైన ‘కంటి వెలుగు -రెండో విడత’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 90 శాతం పూర్తయింది. 100 రోజుల లక్ష్యం పెట్టుకోగా, రికార్డు స్థాయిలో 94 రోజుల్లోనే కోటి 60 లక్షలకు పైగా మందికి పరీక్షలు పూర్తి చేసి, 38 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News