దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలీసా హీలీ అగ్రస్థానానికి చేరుకొంది. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో రికార్డు సెంచరీతో కదం తొక్కిన హీలీ ఏకంగా 4 ర్యాంక్‌లను మెరుగు పరుచుకొని మొదటి స్థానంలో నిలిచింది. హీలీ ప్రస్తుతం 785 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. వరల్డ్‌కప్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచడం హీలీకి కలిసివచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ స్టార్ నటాలి సివర్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు నాలుగో ర్యాంక్‌లో నిలిచిన సివర్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఆస్ట్రేలియా స్టార్ బెథ్ మూనీ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ లౌరా వాల్వ్‌వర్డ్ కూడా తాజా ర్యాంకింగ్స్ కిందికి పడిపోయింది. కిందటిసారి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న లౌరా తాజాగా నాలుగో ర్యాంక్‌తో సరిపెట్టుకొంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది.
అయితే, ఆస్ట్రేలియాకే చెందిన రాఛెల్ హేన్స్ ఆరో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆరో ర్యాంక్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఏడో స్థానంతో సరిపెట్టుకొంది. మరోవైపు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకొంది. ఇంగ్లండ్ స్టార్ బ్యూమౌంట్ పదో ర్యాంక్‌లో నిలిచింది. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఎక్లెస్టోన్ 771 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకొంది. సౌతాఫ్రికా బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ ఒక ర్యాంక్ మెరుగుపడి రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాసెన్ మూడో, మెగాన్ షుట్ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. భారత సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకొంది.
Healy move into top spot in ICC Women’s ODI Rankings