Sunday, January 19, 2025

చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం విజయవాడ ఎసిబి కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు లాయర్లపై ఎసిబి న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు పట్టుపట్టగా, సిఐడి లాయర్లు కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టాలని ఎసిబి కోర్టు న్యాయమూర్తిని కోరారు. ఈ నెల 14న బెయిల్ పిటిషన్ వేశామని ముందు ఈ పిటిషన్ విచారించాలని చంద్రబాబు లాయర్లు జడ్జిని పదే పదే కోరారు. కస్టడీ పిటిషన్‌పై సిఐడి వేసిన మెమోపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు న్యాయమూర్తిని అడిగారు. మెమో ఇంకా తన దగ్గరకు రాకుండా ఎలా నిర్ణయం తీసుకుంటానంటూ న్యాయమూర్తి ఆగ్రహం కనబర్చారు. కస్టడీ పిటిషన్ విచారణలో ఉండగా బెయిల్ పిటిషన్ విచారణ జరగదని పలు కేసులను సిఐడి తరఫు లాయర్లు ఎసిబి కోర్టులో ప్రస్తావించారు. చంద్రబాబును అక్టోబర్ 5 వరకు మరో 11 రోజులవరకు రిమాండ్ విధించిన సంగతి విదితమే.

చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఉదయం సిఐడి న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఇందులో వివరాలు అంతగా లేవని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం దీనిపై వాదనలు తిరిగి ప్రారంభం కాగా, మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి లాయర్లు కోర్టును అభ్యర్థించారు. అయితే ముందుగా బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు లాయర్లు పట్టుపట్టడంపై ఎసిబి కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఏది ముందుగా విచారణ చేపట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన తరువాత ఉత్తర్వులు ఇస్తామని ఎసిబి కోర్టు పేర్కొంది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. సోమవారం ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్దార్థ లుథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని సిజెఐ ప్రశ్నించారు. వివరాలు చెప్పిన తర్వాత మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సిజెఐ చంద్రచూడ్ సూచించారు. ఇదే కేసులో వివిధ కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎసిబి కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే వాదిస్తున్నారు.

ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ఉన్నాయి ఈ లోపే తేల్చుకోవాలని టిడిపి తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ, సెప్టెంబర్ 29న ఢిల్లీ లోకల్ హాలిడే ఉంది. సెప్టెంబర్ 30న శనివారం, అక్టోబర్ 1న ఆదివారం వచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరుపు వాదిస్తున్న లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. 284 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, అజాయకల్లాంను చేర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News