Monday, December 23, 2024

ఎపి సిఎం జగన్ కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

సంక్షేమ పథకాల మాటున ఆర్థిక అక్రమాలంటూ ఎంపి రఘురామ పిటిషన్

మరో 41 మందికి హైకోర్టు నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. సిఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. రాష్ట్రంలో పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతు న్నాయని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఎంపి రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సిఎం అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారని, ప్రజాధనానికి నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎజి శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనం లేదని, వ్యక్తిగత ఉద్దేశంతోనే దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు దీనికి విచారణ అర్హతే లేదని చెప్పారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా ‘ప్రభుత్వ అవినీతి’ అంటూ మీడియాలో రఘురామకృష్ణం రాజు మాట్లాడారని అభ్యంతరం తెలిపారు. రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులు ధ్వంసం చేసిందని కోర్టుకు విన్నవించారు. సిఎం జగన్ తనకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్నారు. ఇసుక, మద్యం, ఆరోగ్య శాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో బంధువులు, అనుకూలురుకు లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సిఎం జగన్‌తో సహా 41 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రతివాదుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపి విజయసాయి, మంత్రి పెద్దిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అటు, సిఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ ఎంపి రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సిఎం జగన్, ఎంపి విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, డ్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, బిపి ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పిఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News