Sunday, February 16, 2025

ప్రార్థనా మందిరాలపై పిటిషన్ల విచారణ రేపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రార్థనా మందిరాలు (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991కి సంబంధించిన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం (17న) విచారణ నిర్వహిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సోమవారం నాటి కేసుల జాబితా ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లను విచారిస్తుంది. ఆ చట్టం ప్రార్థనా మందిరాల మార్పును నిషేధిస్తున్నది. 1947 ఆగస్టు 15న ఉనికిలో ఉన్న ప్రార్థనా మందిరాల్లో దేని మతపరమైన లక్షణాన్ని కొనసాగించేందుకు అది వీలు కల్పిస్తున్నది.

అయితే, అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ సమస్యకు సంబంధించిన వివాదాన్ని దాని పరిధిలో నుంచి మినహాయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లలో కొన్ని 1991 నాటి చట్టం నిబంధనలు కొన్నిటి చెల్లుబాటును సవాల్ చేశాయి. ప్రార్థనా మందిరాల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని కోరుతూ ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం జనవరి 2న అంగీకరిచింది.

ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం నిరుడు డిసెంబర్ 12న 1991 చట్టానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంలో సరికొత్త దావాలను పరిశీలించకుండా, మతపరమైన ప్రదేశాలను ముఖ్యంగా మసీదులు, దర్గాల హక్కులను తిరిగి కోరుతున్న పెండింగ్ కేసులపై మధ్యంతర లేదా అంతిమ ఉత్తర్వులు జారీ చేయకుండా అన్ని కోర్టులపై ఆంక్షలు విధించింది. 1991 చట్టంలోని వివిధ నిబంధనలను సవాల్ చేస్తున్న న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో సహా పిటిషన్లను బెంచ్ విచారిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News