న్యూఢిల్లీ : ప్రార్థనా మందిరాల (ప్రత్యేక నిబంధనల) చట్టం 1991కి సంబంధించిన పిటిషన్ల బొత్తిపై విచారణను ఏప్రిల్ మొదటి వారానికి సుప్రీం కోర్టు సోమవారం వాయిదా వేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయమై విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తెలియజేసింది. ప్రార్థనా మందిరాల (ప్రత్యేక నిబంధనల) చట్టం 1991 చెల్లుబాటుకు సంబంధించిన కేసులో పలు సరికొత్త పిటిషన్లు దాఖలు కావడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉదయం అసహనం వ్యక్తం చేసింది.
1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా మందిరం మతపరమైన లక్షణాన్ని కొనసాగించాలని ఆ చట్టం నిర్దేశిస్తోంది. కక్షిదారు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సోమవారం విచారణ నిమిత్తం సరికొత్త పిటిషన్ దాఖలు గురించి ప్రస్తావించినప్పుడు ‘మేము దానిని చేపట్టలేకపోవచ్చు’ అని సిజెఐ స్పష్టం చేశారు. సోమవారం కేసుల విచారణ ప్రక్రియకు ముందు సీనియర్ న్యాయవాది ఆ విషయం ప్రస్తావించారు. ‘పిటిషన్ల దాఖలుకు ఒక పరిమితి ఉంది. అంత ఎక్కువగా ఐఎలు (మధ్యంతర అర్జీలు) దాఖలు అయ్యాయి. మేము వాటిని చేపట్టలేకపోవచ్చు’ అని సిజెఐ చెప్పారు. వాటికి మార్చిలో ఒక తేదీ ఇవ్వవచ్చునని ఆయన సూచించారు.
వారణాసిలో జ్ఞాన్‌వాపి, మథురలో షాహి ఈద్గా మసీద్, సంభాల్‌లో షాహి జమా మసీదు సహా పది మసీదుల అసలు మతపరమైన లక్షణాలు నిర్ధారించుకోవడానికి సర్వే కోరుతూ వివిధ హిందు సంస్థలు దాఖలు చేసిన దాదాపు 18 దావాల్లో విచారణ ప్రక్రియలను సర్వోన్నత న్యాయస్థానం నిరుడు డిసెంబర్ 12 నాటి ఉత్తర్వు ద్వారా నిలిపివేసింది. సంభాల్‌ల్‌లో ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు మరణించిన విషయం విదితమే. కోర్టు ఆ తరువాత ఆ పిటిషన్లు అన్నిటినీ ఫిబ్రవరి 17న విచారిస్తామని ప్రకటించింది. 1991 చట్టం అమలు కోరుతూ డిసెంబర్ 12 తరువాత పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, సమాజ్‌వాది పార్టీ నేత, కైరానా ఎంపి ఇక్రా చౌదరి, కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి.