ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో కన్నుమూస్తున్నవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. భారతీయులలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. కరోనా అనంతరం 20-30 ఏళ్ల మధ్య వయసున్న యువకులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధన గుండెపోటుకు చెక్ పెట్టే దిశగా ఉండటం సంతోషకరమైన పరిణామం.
తమ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు యూకేలోని ఎనిమిది ఆసుపత్రులలో 40వేల మందికి చెందిన సిటి స్కాన్ నివేదికలను విశ్లేషించారు. వీరిపై మూడేళ్లపాటు పరిశోధనలు జరిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల పనితీరును, వాటి లోపలి భాగంలో పేరుకుపోయే కొవ్వును గమనించే విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కి శిక్షణ ఇచ్చారు. తద్వారా ధమనుల్లో పూడికను ఖచ్చితంగా తెలుసుకుని, గుండెపోటును నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.