కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్లో ఇటీవల సంభవిస్తున్న గుండెపోటు మరణాలు ప్రజలను భీతికొల్పుతున్నాయి. గడచిన ఐదు రోజుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో 98 మరణించారు. ఈ 98 మరణాలలో 54 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందు మరణించినట్లు లక్ష్మీపట్ సింఘానియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ సోమవారం వెల్లడించింది. గత వారం రోజుల్లో 723 మంది రోగులు తమ ఆసుపత్రికి చెందిన ఎమర్జెన్సీ, ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చారని సంస్థ తెలిపింది. గత 24 గంటల్లోనే 14 మంది రోగులు ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించినట్లు తెలిపింది.
మొత్తం 604 మంది రోగులు తమ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, వీరిలో 54 మంది కొత్త రోగులు, 27 మంది పాత రోగులు ఉన్నారని తెలిపింది. ఈ చలి వాతావరణంలో గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు జాలా జాగ్రత్తగా ఉండాలని ఆసుపత్రికి చెందిన కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వినయ్ కృష్ణ సూచించారు. చలికాలంలో గుండెపోటు కేవలం వృద్ధులకు మాత్రమే రాదని, యుక్త వయసు పిల్లలు కూడా గుండెపోటుకు గురవుతున్నారని ఆయన చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా పౌరులంతా చలిగాలుల నుంచి తమను తాము కాపాడుకోవాలని ఆయన సూచించారు.