న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా గురువారం గుండెపోటుకు గురయ్యారు. దైవ దర్శనార్థం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆయనకు గుండెపోటు రాగా వెంటనే ఆయనను ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా,తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తాను తిరిగివస్తున్నానని జస్టిస్ షా ఒక చిన్న వీడియో సందేశం విడుదల చేశారు. దర్శనం(ఆధ్యాత్మిక సందర్శన) కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్లినట్లు ఆయన తెలిపారు. దేవుని దయవల్ల తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన ఆ వీడియో సందేశంలో తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్శనం కోసం ఇక్కడకు తిరిగి తిరిగి వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఒకటి రెండు రోజుల్లో తాను కోలుకుంటానని, మీరు వచ్చి నన్ను చూడవచ్చని ఆయన తెలిపారు. కాగా..చికిత్స నిమిత్తం జస్టిస్ షాను ఢిల్లీకి ఎయిర్ ఆంబులెన్సులో తరలించేందుకు హోం మంత్రిత్వశాఖతో సుప్రీంకోర్టు అధికారులు సమన్వయం చేస్తున్నారు. జస్టిస్ షాతో ఫోన్‌లో మాట్లాడిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చేందుకు హోం మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2018 నవంబర్ 2న నియమితులయ్యారు. ఆయన 2023 మే 15న పదవీ విరమణ చేయనున్నారు.