Sunday, December 22, 2024

‘గుండె’కు ఏమైంది?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై మృతిచెందడం అందరినీ కలిచివేసింది. తారకరత్న చిన్న వయసులో గుండెపోటు బారిన పడిన మృత్యువాతపడటం చర్చనీయాంశంగా మారింది. సామాన్యులు, ప్రముఖులు అంటూ తేడా లేకుండా చిన్న వయసులో యువత గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజ్ కౌశల్‌తో పాటు ఎపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి ప్రముఖులు 40 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్గా పేరొందిన షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందాడు. 52 ఏళ్ల వార్న్ థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో గుండెపోటుతో ప్రాణాలను వదిలాడు.

గతంలో దాదాపు 60 ఏళ్లు పైబడిన వారే గుండెపోటుతో మరణించారన్న వార్త వినే వాళ్లం కానీ ప్రస్తుతం 40 ఏళ్లు ఉన్న యువత కూడా వేగంగా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. సహజంగానే సెలబ్రిటీలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ తీసుకున్నారు. అయినా, వీరు చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే యువకులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. బయటి నుంచి చూడటానికి చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నా కానీ ఇలాంటి వ్యాధులు మీ శరీరం లోపల పెరుగుతుంటాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడగలుతారని సూచిస్తున్నారు.

గుండెపోటు ఎందుకు వస్తుంది…?

గుండెకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ మొదలైనవి రక్త ప్రవాహాన్ని ఆపడానికి కారణం కావచ్చు. ఇవి రక్తంలోకి ప్రవేశించిన వెంటనే గడ్డకట్టడం ఏర్పడి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఈ అంతరాయం కలిగిన రక్త ప్రసరణ గుండె కండరాల భాగాన్ని దెబ్బతీస్తుంది.

యువతలో కూడా గుండెపోటు దారితీసే కారణాలు

ధూమపానం,జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం, రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి కారణంగా యుక్త వయసులో గుండెపోటుకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

ధూమపానం

యువకులలో కొరోనరీ ఆర్టరీ వ్యాధికి ధూమపానం అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. ధూమపానం చేసే యువతలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరిగాయి. వివిధ పరిశోధనల ప్రకారం, ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 8 రెట్లు పెంచుతుంది.

అధిక కొలెస్ట్రాల్

అధిక స్థాయి కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. పరిశోధన ప్రకారం, 190 కంటే ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులకు గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జంక్ ఫుడ్

ప్రస్తుత కాలంలో యువతలో చాలా మంది ఆకలిని తీర్చుకోవడానికి ఇంటి ఆహారానికి బదులు జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. వాటి ప్లేట్లో ప్రొటీన్లకు బదులు జంక్లు, వేయించినవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల చాలా కేలరీలు శరీరానికి చేరి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

డిప్రెషన్

ఒత్తిడి అనేది మనసునే కాదు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా ధమనులను ప్రతికూలంగా ప్రభావితం చేయడంతో అవి కుంచించుకుపోతాయి. డిప్రెషన్ జీవనశైలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

అధిక రక్తపోటు

రక్తపోటు కూడా గుండెపోటుకు ఒక కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఊబకాయం ఉన్న వ్యక్తులకు వారి శరీరానికి ఆక్సిజన్,పోషకాలను సరఫరా చేయడానికి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక బరువు ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News