హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని అపోలో ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలులో మొదటిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. మెట్రో రైలు అధికారుల సహకారంతో కామినేని ఆస్పత్రి వైద్యులు అపోలోకు గుండెను మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తరలించనున్నారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఎల్ బినగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు నాన్‌స్టాప్ మెట్రోలో తరలిస్తారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌డెడ్ కు గురయ్యారు. గుండెను దానం చేసేందుకు రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు వైద్యులు. నాగోలు మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు.