Thursday, January 23, 2025

ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో హృదయవిదారక దృశ్యాలు..

- Advertisement -
- Advertisement -

నవజాత శిశువులు, గర్భిణీలు..ఆస్పత్రి రోగులు
ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో హృదయవిదారక దృశ్యాలు
రాష్ట్రం నుంచి వెళ్లడానికి తరలి వచ్చిన వందలాది మంది
నిర్విరామంగా ఆదుకొంటున్న విమానాశ్రయ సిబ్బంది

ఇంఫాల్: తెగల మధ్య హింసాకాండతో వారం రోజులుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో మంగళవారం పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా నివురుగప్పిన నిప్పులాగానే ఉంది. ఈపరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో రాష్ట్రంనుంచి తమ స్వస్థలాలకు తరలి వెళ్లేందుకు వందలాది మంది ఇంఫాల్ విమానాశ్రయానికి క్యూ కడుతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలుకొని ముసలివాళ్లు ,తూటా యాలయిన వారు కూడా వీరిలో ఉండడం హృదయాలను కలచివేస్తోంది. ఐసియునుంచి అప్పుడే బయటికి వచ్చిన వాళ్లు, బాలింతలు, నేడో రోపో కనడానికి సిద్ధంగా ఉన్న గర్భిణులు, బెడ్‌కే పరిమితమైన క్యాన్సర్ రోగులు ఇలా అన్ని రకాల బాధితులు రాష్ట్రంనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం కోసం గత కొన్ని రోజులుగా ఇంఫాల్ విమానాశ్రయంలో విమానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిలో కొంతమంది తూటా గాయాలతో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.

ఈ దృశ్యాలను చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుందని మంగళవారం పిటిఐతో ఫోన్‌లో మాట్లాడిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) అధికారి ఒకరు చెప్పడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది.
ఇంఫాల్ విమానాశ్రయం టెర్మినల్ ఒక సారి 750 మంది ప్రయాణికులు 250 మంది వచ్చే వాళ్లు, మరో 500 మంది వెళ్లే వాళ్లను మాత్రమే హ్యాండిల్ చేయగలదు. కానీ ఎయిర్‌పోర్టులో 2 వేల మందికి పైగా వేచి ఉన్నారు. ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఎయిర్‌లైన్స్ కంపెనీలు అదనపు విమానాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ రోజురోజుకు క్యూ పెరిగిపోతూనే ఉంది. ఎయిర్‌పోర్టు డాక్టర్లు, ఎఎఐ అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారు. చిక్కుపడిన ప్రయాణికులకు ఎఎఐ ఆహారం, తాగునీరు లాంటివి సరఫరా చేస్తోంది. అయితే బయట అన్ని షాపులు మూతపడి ఉండడంతో అది కూడా కష్టంగా మారుతుండడంతో సాయం కోసం దగ్గర్లోని గౌహతి, అగర్తల, దిబ్రూగఢ్‌లాంటి విమానాశ్రయాలకు అత్యవసర మెస్సేజిలు పంపుతున్నట్లు ఓ అధికారి చెప్పారు. విమానాశ్రయంలో ప్రత్యేక టికెట్ కౌంటర్‌ను తెరిచారు.

అయితే గత వారం రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచి పోవడంతో లోకల్ ఏరియా నెట్‌వర్క్(లాన్)ను ఉపయోగించుకొంటున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. అల్లర్లకు పాల్పడిన వారు రెండు సార్లు ఎయిర్‌పోర్టులోకి చొరబడడానికి యత్నించారు కానీ సఫలీకృతం కాలేదని అధికార వర్గాలు తెలిపారు. హింస చెలరేగినప్పటినుంచీ తాము ఎయిర్‌పోర్టు ఆవరణలోనే ఉంటున్నట్లు ఓ ఉద్యోగి చెప్పారు. కొంతమందికి తగినంత విశ్రాంతి కూడా ఉండడం లేదని ఓ అధికారి చెప్పారు. ఉద్యోగులందరూ షిఫ్టుల వారీగా రోజులో 24 గంటలు పని చేస్తున్నారని ఎఎఐ ఈశాన్యప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ జుగానీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News